పోలీసుల అదుపులో ఏటీఎం కార్డు దొంగ !

24 Jul, 2015 01:54 IST|Sakshi

మందస: ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బును డ్రా చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చిన్నకేసుపురం గ్రామానికి చెందిన మడియా హేమలత డబ్బులు తీసేందుకు హరిపురం ఎస్‌బీఐ ఏటీఎంకు వచ్చింది. అయితే ఆమెకు ఆపరేటింగ్ తెలియక పోవడంతో ఇతరుల సహాయం కోసం వేచిఉంది. ఇదే సమయం ఓ యువకుడు రావడంతో హేమలత అతనికి ఏటీఎం కార్డును ఇచ్చి రూ.1000 తీయించారు. ఇదే అదనుగా ఆ యవకుడు అదే రంగులో ఉన్న వేరే  ఏటీఎం కార్డును ఆమెకు ఇచ్చాడు.
 
 అది గమనించని హేమలత దాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అక్కడికి కొన్ని గంటల తరువాత తన అకౌంట్ నుంచి రూ.25 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే హేమలత గురువారం మందస వచ్చేందుకు హరిపురంలో ఆటో ఎక్కగా అందులో ఏటీఎం దగ్గర సాయం చేసిన యువకుడు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అయితే మందసలో ఆటో ఆగిన వెంటనే యువకుడు పారారయ్యేందుకు ప్రయత్నించగా హేమలత అతన్ని పట్టుకున్నప్పటికీ ఆమె నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
 
 ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేయడంతో అప్రమత్తమైన సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెతికారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులను గుర్తించలేని ఆ యువకుడు హరిపురం అర్జంట్‌గా వెళ్లాలని, తనను డ్రాప్ చేయాలని ఒడియా భాషలో అడిగాడు. అతని తొందరపాటును గ్రహించిన పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ  దృష్టిలో ఈ విషయాన్ని పెట్టామని, ఆయన వచ్చాక యువకుని పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు