పేట్రేగిపోతున్న ఏటీఎం దొంగలు

15 May, 2016 00:58 IST|Sakshi

 పార్వతీపురం: ఇంతవరకు మెట్రో నగరాలకే పరి మితమైన ఏటీఎం దొంగతనాలు తాజాగా పార్వతీపురంలోనూ మొదలయ్యాయి. జనశక్తి కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ గుర్తు తెలియని అగంతుకుడి మాయలో పడి ఏటీఎంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 8న స్థానిక మెయిన్ రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఏటీంలో డబ్బులు తీసేందుకు ఉపాధ్యాయుడు సత్యనారాయణ వెళ్లాడు.
 
 అయితే ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా ఏటీఎం స్క్రీన్‌లోని అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడంతో తికమక పడి బయటకు వచ్చేశాడు. ఇంతలో ఓ అపరిచితుడు డబ్బులు తీసి ఇస్తానని చెప్పి సత్యనారాయణచే ఆపరేటింగ్ చేయించారు. ఈ క్రమంలో ఒకసారి కార్డు పెట్టి రూ. 10 వేలు తీశారు. మరలా కార్డు అవసరం లేదంటూ అగంతకుడు మరో రూ. పది వేలు తీయించాడు. ఈలోపు అపరిచితుడు రోడ్డుమీదున్న తన ద్విచక్ర వాహనం పడిపోవడంతో వెళ్లి దాన్ని పెకైత్తి మరలా ఏటీఎంలోకి వచ్చాడు.
 
 మళ్లీ సత్యనారాయణచే కార్డు పెట్టించి రూ.  పది వేలు తీయించాడు. ఈ నగదును బాధితుడు లెక్కబెడుతుండగా, ఏటీఎం నుంచి (లావాదేవీలు కొనసాగించి) మరో పది వేలు తీసుకుని అపరిచితుడు పరారయ్యాడు. దీంతో బాధితుడు లబోదిబోమని పోలీసులను ఆశ్రయించాడు. పార్వతీపురంలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఏటీఎంల వద్ద గార్డులను ఏర్పాటు చేయనంతవరకు ఇటువంటి దొంగతనాలను ఆపలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.  
 

మరిన్ని వార్తలు