అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం 

5 Dec, 2018 14:30 IST|Sakshi

ఆకాశంలో కారుమబ్బులు

వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్‌

జిల్లాలో కొన్నిచోట్ల చిరుజల్లులు

కళ్లాల్లోనే ధాన్యం రంగుమారే ప్రమాదముందని ఆందోళన 

భీమవరం: బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంగళవారం వర్షం జల్లులు పడడంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్‌ పెరిగి మాసూళు ధరను పెంచి వసూలు చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలోని అనేక గ్రామాల్లో వరిపంట పొలాల్లోనే ఉండగా మాసూళ్లు పూర్తిచేసిన ప్రాంతాల్లో ధాన్యం అమ్మకాలు పూర్తికాక వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5.60 లక్షల ఎకరాల్లో సార్వా వరిసాగు చేయగా మెట్టప్రాంతాల్లో దాదాపు మాసూళ్లు పూర్తయ్యాయి. డెల్టాలోని సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగుచేయగా దాదాపు 75 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తి చేయాల్సి ఉందని అంచనా. సార్వా సీజన్‌ ప్రారంభం నుంచి  సాగునీరు సక్రమంగా అందకపోవడం, నారుమడుల సమయంలో భారీ వర్షాల కారణంగా నారు దెబ్బతిని రెండు, మూడు పర్యాయాలు నారువేయాల్సి రావడం వంటి ఇబ్బందులతో రైతులు సతమతమయ్యారు.

ఎన్నో వ్యయప్రయాసలతో పైరును పెంచి పోషించి పంట చేతికి వస్తున్న సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా రైతులకు అధిక పెట్టుబడి తప్పడం లేదని వాపోతున్నారు. నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు కర్ణాటక పరిసరాల్లో ఉపరితల అవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతోపాటు బుధవారం ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలపడంతో రైతుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే మంగళవారం ఉదయమే వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు కురవడంతో రైతులు తమ ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోడానికి హైరానా పడ్డారు.

పంట పొలాల్లో పనలపైనే..
ప్రస్తుత సార్వా సీజన్‌లో ఎక్కువమంది పంట మాసూళ్లుకు వరి కోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది రైతులు పశుగ్రాసం కోసం వరిగడ్డిని నిల్వ చేసుకోడానికి కూలీలతో కోతకోయించి పనలపై ఆరబెట్టిన తరువాత కుప్పనూర్పిళ్లు చేయిస్తున్నారు. ఆ విధంగా డెల్టా ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పనలపైనే ఉంది. చిరుజల్లులకు పంట తడిసిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కూలీలను ఉపయోగించి నూర్పిళ్లు చేయించడానికి పరుగులు పెడుతున్నారు. కనీనం వరి పనలను గట్టుచేర్చి కుప్పగా వేసి వాతావరణం అనుకూలించిన తరువాత నూర్పిడి చేయించవచ్చుననే సంకల్పంతో కుప్పలు, నెట్టుకట్టడం వంటి పనుల్లో మునిగిపోయారు.

వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్‌
ప్రస్తుత సార్వా సీజన్‌లో ఎక్కువశాతం మంది రైతులు వరికోత యంత్రాలతో మాసూళ్లు చేయిస్తుండడంతో ఇతర జిల్లాల నుంచి యంత్రాలను తీసుకువచ్చి ఎకరాకు రూ.1,800 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. యంత్రాలు కూడా ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో రైతులకు అనుకూలమైన ధరల్లోనే మాసూళ్లు పూర్తవుతున్నాయి. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా రైతులంతా ఒకేసారి కోతలు పూర్తిచేయించడానికి కంగారు పడడంతో యంత్రాల యజమానులు ధరలను పెంచినట్టు చెబుతున్నారు. మంగళవారం ఎకరాకు రూ.2,000 వసూళు చేస్తున్నారని బుధవారం «ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

కళ్లాల్లోనే ధాన్యం
సార్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో సాగుతుండడంతో «ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం తగ్గడానికి నాలుగైదు రోజుల పాటు ఎండబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాసూళ్లు పూర్తి చేసిన రైతులు సైతం ధాన్యం ఎండబెట్టడానికి కళ్లాల్లోనే ఉంచడడంతో తడిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యం వెంటనే ఎండబెట్టకపోతే రంగుమారి ముక్కపాయ వచ్చే ప్రమాదముందని రంగుమారిన ధాన్యం ధర తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు