గోదావరి వరదలో చిక్కుకున్న ఎస్‌ఐ

9 Jul, 2019 13:33 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : గోదావరి వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు కొద్దిగా శ్రమించాల్సి వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా ఆత్రేయపురం వద్ద గోదావరి నదిలో హై టెన్షన్‌ టవర్ల నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం జేసీబీని తెప్పించి ఇసుక తవ్వకం చేపట్టారు. పలువురు కూలీలు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఎగువున కురుస్తున్న వర్షాలకు ధవశేశ్వరం వద్ద నీటి మట్టం పెరగడంతో నీటిని దిగువకు వదిలారు. ఈ క్రమంలో ఆత్రేయపురం వైపు నీటి ప్రవాహం పెరిగింది. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో కూలీలు, జేసీబీతో డ్రైవర్‌ నది మధ్యలో చిక్కుపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

ఆత్రేయపురం ఎస్సై నదిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు నాటు పడవలో బయలుదేరారు. అయితే ఇసుక దిబ్బల కారణంగా ఆయన బోటు కూడా వరదలో చిక్కుకుపోయింది. దీంతో రావులపాలెం నుంచి బయలుదేరిన అగ్నిమాపక సిబ్బంది నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే జేసీబీని బయటకు తీసుకురావడంలో మాత్రం కొద్దిపాటి ఆలస్యం జరిగింది.

మరిన్ని వార్తలు