దాడి చేసిన ఆంధ్రా ఉద్యోగులపై అట్రాసిటీ కేసులు పెట్టాలి

17 Aug, 2013 03:54 IST|Sakshi
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంత అధికారి హన్మంత్‌నాయక్‌పై గుంటూరులో జరిగిన దాడిని నిరసిస్తూ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నేతలు శుక్రవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఏపీఎన్‌జీఓ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత గిరిజన గ్రూప్-1 అధికారి హన్మంత్‌నాయక్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేయడం తెలంగాణవాదులను రెచ్చగొట్టడమేననీ, తెలంగాణవాదులు తలుచుకుంటే సీమాంధ్ర ఉద్యోగులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. గిరిజన అధికారిపై దాడి చేసిన సీమాంధ్ర ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు దాడిచేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణవాదుల మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఈ విధానానికి స్వస్తి పలకకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పోముసింగ్, ప్రకాశ్, శ్రీకాంత్, మారుతి, శివ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు