ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుపై దాడి

18 Jun, 2018 02:23 IST|Sakshi
అశోక్‌బాబుపై దాడి చేస్తున్న దృశ్యం

     గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ సమావేశం రసాభాస

     అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డిపై కొందరు ఉద్యోగుల దాడి

హైదరాబాద్‌: ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్‌ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దాడిలో అశోక్‌బాబు చొక్కా చిరిగిపోగా, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశాయి.

దాడులకు దిగిన ఉద్యోగులు..
గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీలో 5,500 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 3,000 మంది ఏపీకి వెళ్లగా, 2,500 మంది తెలంగాణలో స్థిరపడి ఉన్నారు. కాగా, సొసైటీలో స్థలం కోసం అలాట్‌మెంట్‌ సభ్యులు ఒక్కొక్కరు రూ.1,60,000 చెల్లించగా.. మిగిలిన నాన్‌ అలాటీ సభ్యులు రూ.30,000 చెల్లించారు. ఉద్యోగులు చెల్లించిన మొత్తం రూ.34 కోట్ల వరకు జమయ్యింది. అయితే స్థలాల కోసం డబ్బులు చెల్లించిన కొందరు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని అశోక్‌బాబుపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అశోక్‌బాబు వర్గం, ఇతర ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన పలువురు ఉద్యోగులు భౌతిక దాడులకు పాల్పడ్డారు.

విచారణ చేపట్టాలి: సత్యనారాయణగౌడ్‌
గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీని విభజించాలని కోరుతున్నప్పటికీ అశోక్‌బాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడని భాగ్యనగర్‌ తెలంగాణ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌ ఆరోపించారు. సొసైటీ పేరుతో ఉద్యోగుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేశారని, అందులో రూ.18 కోట్లకు అభివృద్ధి పేరిట తప్పుడు లెక్కలు చూపించారని చెప్పారు. అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

పథకం ప్రకారమే దాడి: అశోక్‌బాబు
హౌసింగ్‌ సొసైటీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే సమయంలో తనపై, చంద్రశేఖర్‌రెడ్డిపై పథకం ప్రకారం దాడి చేశారని అశోక్‌బాబు అన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప దాడులతో కాదని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు