రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి

27 Dec, 2019 11:46 IST|Sakshi

సాక్షి, ఉద్దండరాయునిపాలెం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్‌ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఓ చానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో మీడియా ప్రతినిధిపైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మీడియా ప్రతినిధుల మీద రైతులు ముసుగులో కొందరు కావాలనే దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే.. పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్‌ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. 

>
మరిన్ని వార్తలు