రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి

2 Aug, 2018 01:23 IST|Sakshi

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన

రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. దళితవాడకు చెందిన కొందరు పోలీస్‌స్టేషన్‌ గేట్లు ధ్వంసం చేసి, లోపలికి జొరబడ్డారు. పోలీసులపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  

రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్‌ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

దాదాపు 40 మంది స్టేషన్‌లోకి ప్రవేశించారు. అక్కడ కనిపించిన పోలీసులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. విధినిర్వహణలో ఉన్న ఎస్‌ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. ఇతర సిబ్బంది గాయపడ్డ ఎస్‌ఐని, కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌పై దళితవాడకు చెందిన వ్యక్తులు దాడిచేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

మమ్మల్ని అమానుషంగా కొట్టారు  
పోలీసులు తమను విచారణ కోసం పిలిపించి మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా కొట్టి గాయపరిచారని, కులం పేరుతో దూషించారని దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ ఆరోపించారు. తమతోపాటు పెంచలయ్య అనే యువకుడిని కూడా పోలీసులు కొట్టారని చెప్పారు.  

ఎస్‌ఐ తలకు బలమైన గాయం: డీఎస్పీ  
దళితవాడ వాసుల దాడిలో గాయపడ్డ రాపూరు ఎస్‌ఐ, కానిస్లేబుళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించామని డీఎస్సీ రాంబాబు చెప్పారు. ఎస్‌ఐ తలకు బలమైన గాయం అయిందని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు