అధికారం చేతిలో ఉంటే ఇంత దారుణమా...?

24 Mar, 2019 11:14 IST|Sakshi
పోలీసుల సాక్షిగా రఫీపైకి దూకుతున్న టీడీపీ నేతలు

సర్వే పేరుతో సామాన్యులపై దాడులు

పార్టీ పట్టణ అధ్యక్షుడిని చంపుతామంటూ ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపు

సాక్షి, కందుకూరు (ప్రకాశం): ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అడ్డుకున్న వారిపై దాడులకు దిగుతున్నారు. శనివారం పట్టణంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. వార్డుల్లో సర్వే చేస్తున్న ఇద్దరు యువకులను వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, వారిని ఆర్డీఓకు అప్పగించేందుకు తీసుకురావడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తలు పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. సాక్షాత్తు పోలీసుల సాక్షిగా టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావు తమ్ముడు ప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీపై దాడికి యత్నించాడు. చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

ఇదీ..జరిగింది
టంగుటూరుకు చెందిన ఇద్దరు యువకులు శనివారం ఉదయం పట్టణంలోని 17వ వార్డు అజ్మల్‌ హుస్సేన్‌ హాస్పటల్‌ ఏరియాలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి పేర్లు సేకరించడంతో పాటు సమస్యలు అడగడం అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌లు ఎవరు ఉన్నారు అనే తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సామాన్య ప్రజలతో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని యువకులను నిలదీశారు. సర్వేలు ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం సర్వేలు చేయడం నిషిద్ధమని వారిని ఎన్నికల అధికారి అయిన ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆర్డీఓకి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ లోపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలను ఎందుకు తీసుకొచ్చారంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సర్వే చేస్తుంటే తీసుకొచ్చామంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు సమాధానం చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీతో పాటు మరికొంత మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు. టీడీపీ వైపు నుంచి ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్, ఉన్నం వీరాస్వామి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కళ్యాణ్‌ తదితరులు తమ అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు.

చంపుతానంటూ రఫీకి బెదిరింపులు 
వైఎస్సార్‌ సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీపైకి దూసుకెళ్లారు. వేలు చూపుతూ చంపుతానంటూ బెదిరింపులకు దిగాగు. ఇదే సమయంలో అక్కడ ఉన్న సీఐ, ఎస్‌ఐలు, పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓ మైనార్టీ నాయకుడిని చంపుతానంటూ బెదిరింపుకు దిగడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నా పట్టించుకోవడం లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు చేరుకుని టీడీపీ నాయకుల బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. కందుకూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయినప్పడు ఆ పార్టీ నేతలు వివిధ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిన విషయాన్ని ఇప్పటికి సామాన్యులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు
నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేయడం, తాయిలాలు ఎరవేయడం వంటి నీచమైన పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పక్క నియోజకవర్గం కొండపి, టంగుటూరు ప్రాంతాలకు చెందిన యువకులను ఇక్కడికి తీసుకొచ్చి సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతున్నారు. ఎటువంటి సర్వేలు చేసేందుకు వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా ఉల్లంఘించి మరీ సర్వేలు చేస్తున్నారు. అయినా ఎన్నికల అధికారులు పట్టించుకుంటున్న పాపాన లేదు. ఇటువంటి గొడవలకు పరోక్షంగా వారే కారణం అవుతున్నారు.

ఎమ్మెల్యేనే సర్వే చేయమన్నారు..
పట్టుబడిన ఇద్దరు యువకులు మాట్లాడారు. తాము తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నామని అంగీకరించారు. టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావే సర్వే చేయమంటే చేస్తున్నామని ఒప్పుకున్నారు. వాళ్లు చెప్పిన ప్రకారం ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో సమస్యలు అడగడంతో పాటు వారి ఫోన్‌ నంబర్లు తీసుకుంటున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఇళ్లు సర్వే చేసిన తర్వాత తమను పట్టుకుని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారని అందరి ముందు తలలు దించుకుని సమాధానం చెప్పారు.

మరిన్ని వార్తలు