సర్దుకుపోదాం...!

12 Jul, 2015 01:13 IST|Sakshi

 బెల్టు షాపులపై దాడులు జరుగుతాయి... కానీ కేసు నమోదు కాదు. లూజు విక్రయాలు... ఎమ్మార్పీకంటే అధిక మొత్తాలకు విక్రయాలు చేసినట్టు ఫిర్యాదు చేస్తే.. వెంటనే వచ్చివాలుతారు... కానీ చర్యలుండవు. పర్మిట్‌రూమ్‌లను బార్లుగా మార్చేస్తే... వార్నింగ్‌లిస్తారు... కానీ మూయించరు. అయితే గియితే... నెలకో... రెండు నెలలకో ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారు. ఇదంతా ఎక్సయిజ్ అధికారులు మద్యం వ్యాపారులతో చేసుకున్న లోపాయికారి ఒప్పందమట!
 
 వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలకు లెసైన్సు పొందిన వ్యాపారులు హుషారుగా ఉన్నారు. అవసరమైనచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎమ్మార్పీకంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. అయినా ఎక్సయిజ్ అధికారులు కిమ్మనడంలేదు. ఎందుకంటే లక్ష్యాలు పూర్తవ్వడమే లక్ష్యం. ఒకవేళ చర్యలు తీసుకున్నా తూతూ మంత్రంగా నెలకో కేసు నమోదు చేస్తారంట. జిల్లాలో 202 మద్యం షాపులకు ఇటీవల లెసైన్సులు మంజూరు చేశారు. 23 మండలాల్లో సర్కారు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా విస్తృతంగా బెల్టుషాపులు ఏర్పాటైపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత బెల్టుషాపులపై నిషేధం విధించింది.
 
 దీనివల్ల కొంతమేరకు మద్యం అమ్మకాలకు తెర పడుతుందనుకున్నారు. కాని లక్ష్యాల పేరుతో అధికారులే బెల్టు షాపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై దాడులు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా... కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. నిత్యం నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం లక్ష్యాల మాటున ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలపైనా, పర్మిట్‌రూమ్‌ల్ని బార్లుగా మార్చేయడంపైనా... వీరు పట్టించుకోవడం లేదు. బడ్డీకొట్లు.... టీస్టాళ్లు... కిరాణా అంగళ్లు మద్యం కేంద్రాలుగా మారినా దాడులు కరువయ్యాయి.
 
 ఎందుకిలా...?
 ఈ ఏడాది కొత్తగా సర్కారు దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రభావం ప్రైవేటు వ్యాపారులపై పడింది. దీంతో అమ్మకాలు కూడా గతేడాది కంటే తక్కువగానే ఉన్నాయి. దీంతో బెల్టుషాపుల ఏర్పాటుకు ప్రైవేటు వ్యాపారులు తెర తీశారు. బెల్టుషాపు కావల్సిన వారికి ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. పాలకొండ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో సుమారు 250 గ్రామాలు ఉన్నాయి. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ బెల్టుషాపులు కొన్ని బహిరంగంగా... మరికొన్ని గుట్టుగా కొనసాగుతున్నాయి. గతేడాది నెలకు ఒక్కో మండలం నుంచి ఒకటి, రెండు కేసుల చొప్పున ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసి, 2,128 క్వార్టరు బాటిళ్లను స్వాధీనం చేసుకొని 70 మందిని అరెస్టు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసులు కూడా ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల నమోదు చేసినవేనని తెలుస్తోంది. ఈ సారి బెల్టుషాపులు పెరుగుతున్నా కేసులు నమోదు మాత్రం జరగడంలేదు. అధికారులు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 దాడులు చేస్తున్నాం
 ఈ విషయంపై పాలకొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారావు వద్ద ప్రస్తావించగా బెల్టుషాపులపై దాడులు నిర్విహ స్తున్నామని, బెల్టుషాపుల వివరాలను తెలియజేస్తే అటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు