కోర్టు తీర్పుతో ఆర్టీసీ బస్సు స్వాధీనానికి యత్నం

7 Sep, 2019 10:24 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: తెలంగాణ ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకునేందుకు అమీనా, అడ్వకేట్‌తో పాటు న్యాయస్థానం నుంచి అవార్డు పొందిన వారు శుక్రవారం సాయంత్రం ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 2006లో జరిగిన ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానం రూ. 12లక్షలు చెల్లించాలంటూ టీఎస్‌ఆర్టీసీని ఆదేశించింది. అయితే వారు ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడికి చెల్లించలేదు.

దీంతో ఇటీవల అతను మరలా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయడంతో న్యాయస్థానం టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన బస్సును స్వాధీనం చేసుకోమంటూ ఫిర్యాదు దారుడికి స్పష్టం చేసింది. దీంతో సంబంధిత ఫిర్యాదు దారుడు న్యాయస్థానం నుంచి అమీనాతో సైతం ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుంటున్నామని ప్రకటించడంతో షాక్‌కు గురవడం బస్సు డ్రైవర్‌ వంతైంది. చివరకు స్థానిక ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకుని టీఎస్‌ఆర్టీసీ అధికారులతో మాట్లాడగా బస్సును వదలమని కోరారు. సంబంధిత మొత్తాన్ని కూడా తాము జమ చేస్తామని అంగీకరించడంతో బస్సును వదిలేశారు. అయితే ఫిర్యాది ఎవరు, ఏ కోర్టు నుంచి వీరు వచ్చారనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు