కమిషనర్‌గా ఐఏఎస్ వచ్చేనా!

24 May, 2015 03:44 IST|Sakshi

ఐఏఎస్ వస్తే తమకు గుర్తింపు  తగ్గుతుందన్న ధోరణిలో మేయర్
ఐఏఎస్ రాకుండా ప్రయత్నం

 
 కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి మూణ్ణాల ముచ్చటగానే మారింది. ప్రభుత్వం హుటాహుటిన రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లలో ఐఏఎస్‌లను నియమించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ స్థానంలో ఐఏఎస్‌ను నియమించారు. అయితే టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఐఏఎస్ కమిషనర్‌ను బదిలీ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఈ సారి ఐఏఎస్ రావడం కష్టమేనని తెలుస్తోంది.
 
 నెల్లూరు, సిటీ : నెల్లూరు నగరపాలక సంస్థకు ఐఏఎస్ కమిషనర్‌గా వస్తే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని మేయర్ అబ్దుల్ అజీజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మేయర్ ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గత కమిషనర్ ఐఏఎస్ చక్రధర్‌బాబు, మేయర్ అబ్దుల్ అజీజ్‌కు మధ్య సయోధ్య కుదరలేదు. తనను సంప్రదించకుండానే కమిషనర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పలు అంశాలతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఓ సమావేశంలో అధికారులనుద్దేశించి మేయర్‌తో కలిసి పనిచేయకపోతే బదిలీపై వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  గత నెల 12న కమిషనర్ చక్రధర్‌బాబు తూర్పుగోదావరి జిల్లా  రంపచోడవం ఐటీడీఏ పీడీగా బదిలీపై వెళ్లారు. ఈ బదిలీ వెనుక మేయర్ ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. చక్రధర్‌బాబు బదిలీ అయి నెలకు పైగా గడుస్తున్నా కొత్త కమిషనర్‌ను నియమించలేదు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

అయితే ఆయనకు జిల్లా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో కార్పొరేషన్‌పై శ్రద్ధ చూపట్లేదనే ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే ఇంతియాజ్ కార్పొరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్పొరేషన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మంత్రి నారాయణ  వచ్చే నెల ఆరో తేదీన రాజధాని నిర్మాణ కార్యక్రమం పూర్తయిన తరువాత కమిషనర్ల బదిలీలు ఉంటాయని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్‌ను నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తమ మాట వినలేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు బదిలీ చేయడం ఎంతవరకు సబబు అని పలు పార్టీ నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేయర్ నిరంకుశ ధోరణికి ఈ బదిలీ నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు.
 
 అస్తవ్యస్తంగా పారిశుధ్యం
 నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు ఉన్న సమయంలో కొంత గాడిలో పడుతున్న సమయంలో టీడీపీ రాజకీయ క్రీడలో ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో అవినీతి పరులకు రెక్కలొచ్చాయి. కార్పొరేషన్‌లో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సి వస్తోంది. లేకపోతే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. నగరంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే కనిపిస్తోంది. అధికారులకు ఆదేశాలు జారీ చేసే వారు లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు.

సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గత కమిషనర్ చక్రధర్‌బాబు గ్రీవెన్స్‌ను ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లినప్పటి నుంచి కార్పొరేషన్‌లో గ్రీవెన్స్‌ను నిర్వహించే అధికారులు లేకుండా పోయారు. ప్రజలు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మొత్తం మీద కార్పొరేషన్ గాడి తప్పిందనే ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు