జాబ్‌ ఫర్‌ సేల్‌

6 May, 2018 08:19 IST|Sakshi
ఏసీఎస్సార్‌ ప్రభుత్వ వైద్యకళాశాల

ప్రభుత్వ వైద్యకళాశాలలో చక్రం తిప్పుతున్న అటెండర్‌

పోస్టుకు రూ.50వేల డిమాండ్‌

శానిటేషన్‌ వర్కర్లుగా ఐదుగురి నియామకం

‘మీరు నిరుద్యోగులా.. అయితే రండి మావద్ద పోస్టులు సిద్ధంగా ఉన్నాయి.. కొంత మొత్తాన్ని చెల్లించుకుంటే వెంటనే ఉద్యోగంలో చేర్పిస్తాం.’  అంటూ నగరంలోని ఏసీఎస్సార్‌ ప్రభుత్వ వైద్యకళాశాల్లో వినిపిస్తున్న మాటలు.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నాని నేడు బహిర్గతమైంది. ఆ వైద్య కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన టాలెంట్‌తో అధికారులను లోబరుచుకుని, వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తనకు అవసరమైన పనిని వారితో చేయించుకుంటూ చక్రం తిప్పుతోంది.

నెల్లూరు(బారకాసు): నిరుద్యోగులుగా ఉన్న కొందరికి నగరంలోని ఏసీఎస్సార్‌ ప్రభుత్వ వైద్యకళాశాల్లో శానిటేషన్‌ వర్కర్లుగా పోస్టులు ఇప్పిస్తానంటూ ఆ కళాశాలలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి(అటెండర్‌)  ఆఫర్‌ ఇచ్చింది. ఆమె మాటలు నమ్మిన కొందరు సదరు అటెండర్‌ను కలిశారు. శానిటేషన్‌ వర్కర్‌ పోస్టు ఇప్పించేందుకు బేరం పెట్టింది. ఎవరైతే ఎక్కువ మొత్తంలో ముడుపులు ఇచ్చారో వారికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలో శానిటేషన్‌ వర్కర్‌గా నియమించింది. ఇలా ఒకరిద్దరు కాదు ఐదుగురుకు పోస్టులు ఇప్పించింది. వీరి దగ్గర నుంచి సుమారు రూ. 3లక్షలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఐదు నెలల క్రితం ఆర్‌.సుజాత, పెంచలనరసింహం వద్ద నుంచి (ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.50వేలు) లంచం తీసుకుని శానిటేషన్‌ వర్కర్లుగా నియమించింది. 10రోజుల క్రితం ఎన్‌.కుమార్, ఎం.గిరీష్, ఎస్‌కే షాహీనా వద్ద నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేసి వారిని కూడా శానిటేషన్‌ వర్కర్లుగా నియమించేటట్లు చక్రం తిప్పింది.

ఈ విషయం అక్కడున్న అసిస్టెంట్‌ డైరెక్టర్, సూపర్‌వైజర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు తప్ప మరెవరికీ తెలియకుండా జరిగిపోయింది. శానిటేషన్‌ వర్కర్లను నియమించుకోవాలంటే ఎవరైతే కాంట్రాక్టరు ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే నియమించుకోవాలి. అయితే ఆ కాంట్రాక్టరు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. ఇదే అదనుగా చూసుకున్న సదరు మహిళా ఉద్యోగి అక్రమ సంపాదనకు పక్కాగా ప్లాన్‌ వేసి కాంట్రాక్ట్‌ వర్కర్లను నియమించే విధంగా చేసింది. ఈ విషయం బయటకు పొక్కగానే సదరు అటెండర్‌ అయిన మహిళా ఉద్యోగి తనకేమైనా ఇబ్బంది వస్తుందా.. తనపై ఏమైనా చర్యలు తీసుకుంటారేమోనని ముందుగానే వైద్యకళాశాలలోని కొందరు అధికారులను లోబర్చుకుని, వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని సహచర ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. 

సెలవుపై వెళ్లిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌
మహిళా ఉద్యోగి ఐదుగురి వద్ద ముడుపులు తీసుకుని శానిటేషన్‌ వర్కర్లుగా నియమించాలని, వైద్యకళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యోగీశ్వరరెడ్డిని కోరగా వెంటనే ఆమె మాటతో ఆ ఐదుగురిని వెంటనే నియమించారని సమాచారం. ఎవరికీ తెలియకుండా తమ ఇష్టారాజ్యంగా ఐదుగురిని శానిటేషన్‌ వర్కర్లుగా నియమించిన విషయం బహిర్గతం కావడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం సెలవు పెట్టి తన ఊరికి వెళ్లారని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తూ అధికారులను సైతం లోబర్చుకుని వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అక్రమ సంపాదన కోసం వారిచే చేయకూడని పనులు చేయించడం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సదరు ఉద్యోగినిపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఆ అటెండర్‌ ఎంతటికైనా తెగించి ప్రభుత్వ వైద్యకళాశాల పరువు తీసేందుకు వెనుకాడదనడం ఏమాత్రం సందేహం లేదని అక్కడ పనిచేస్తున్న కొందరు శానిటేషన్‌ వర్కర్లే ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం
ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకుని కొందరని శానిటేషన్‌ వర్కర్లుగా నియమించిన విషయంపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో వారిపై చర్యలు తీసుకుంటాం.–డాక్టర్‌ రవిప్రభు, ప్రిన్సిపల్‌ ఏసీఎస్సార్‌ ప్రభుత్వవైద్యకళాశాల

మరిన్ని వార్తలు