ఆస్తిని చేజిక్కించుకునేందుకే కుట్రలు

18 Jan, 2015 15:49 IST|Sakshi
ఆస్తిని చేజిక్కించుకునేందుకే కుట్రలు
  • అత్తింటివారిపై చక్రి సతీమణి శ్రావణి ఆరోపణ
  • హైదరాబాద్ : తనను రోడ్డు పాలుచేసి తన భర్త సంపాదించిన ఆస్తినంతా కొల్లగొట్టాలనే పథకం ప్రకారం తన అత్తింటివారు తనపై విషం చిమ్ముతున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి సతీమణి శ్రావణి ఆరోపించారు. తన భర్త మరణధ్రువీకరణ పత్రం రశీదును తీసుకునేందుకు పంజాగుట్ట శ్మశానవాటికకు శనివారం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న తనను అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ, మరిది మహిత్‌లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.

    చక్రి మరణంపై తొలుత అనుమానం వ్యక్తం చేసింది తానేననీ ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. చక్రి సంపాదన మీదే కుటుంబీకులు ఆధారపడేవారనీ ఆయన ఉన్నప్పుడు పెద్దమొత్తంలో ఖర్చులు చేసి ఆడపడుచు బిడ్డలను చదివించేవారనీ ఇప్పుడు వాటిని భరించే శక్తిలేక వారు కొత్త కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. తమకు  సోమాజిగూడలో ఒకప్లాట్, మొయినాబాద్‌లో 1000 గజాల ఖాళీ స్థలం,  ఘట్‌కేసర్ వద్ద 666 గజాల మరోప్లాట్, తిరుపతిలో కూడా ఓ ఖాళీ స్థలం ఉన్నాయనీ వాటిపైన అత్తింటివారు కన్నేశారని తెలిపారు.

    చక్రి,తాను సరోగసి విధానంలో బిడ్డను పొందాలనుకున్నామని అది నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచారన్నారు. తనకు అండగా చక్రి స్నేహితులు నిలుచున్నారనీ వారి సాయంతో సమస్యలను అధిగమించగలనని చెప్పారు.అత్తింటి వారు చేసిన ఒత్తిళ్లకు మనోవేదనకు గురై చక్రి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. త్వరలో చక్రిపేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వర్ధమాన గాయనీ,గాయకులను ప్రోత్సహిస్తానన్నారు. ఓ స్టూడియో కూడా ఏర్పాటు చేసే యోచన కూడా తనకుందన్నారు.
     
    చక్రి డెత్ సర్టిఫికెట్ రశీదును తీసుకున్న శ్రావణి


    చక్రి మరణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం రశీదును  పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్ శనివారం చక్రి సతీమణి శ్రావణికి అందజేశారు. గత నెల 16వ తేదీన చక్రి బావ నాగేశ్వరరావు ఇదే శ్మశాన వాటిక నుంచి రశీదును తీసుకెళ్లిన సంగతి విదితమే. అతను దాన్ని శ్రావణికి ఇవ్వకుండా అతని దగ్గరే అట్టి పెట్టుకున్నారని అందుకే బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఏఎంహెచ్‌వో సూచనల మేరకు ఆ రశీదును రద్దుచేసి కొత్తగా మరో రశీదును శ్రావణికి జారీ చేసినట్లు  పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడుఅనిల్‌కుమార్ తెలిపారు. తాము ఇప్పుడిస్తున్న రశీదు మాత్రమే చక్రి డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు.
     

మరిన్ని వార్తలు