కోరలు చాచిన ‘కోడెల’ నాగులు

30 Jun, 2019 12:40 IST|Sakshi

దళితుల పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తిని కాజేసిన బంధువులు

అక్రమార్కులకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు

న్యాయం కోసం కోడెల శివరామ్‌ను ఆశ్రయిస్తే ఊరొదిలి వెళ్లాలని బెదిరింపులు  

అప్పట్లో పట్టించుకోని పోలీసులు

ప్రభుత్వం మారడంతో తాజాగా మరోసారి ఫిర్యాదు చేసిన బాధితులు 

కోడెల కుమారుడు, కుమార్తెపై అట్రాసిటీ కేసు నమోదు

కష్టాల్లో తోడుండాల్సిన సొంత బంధువులే తోడేళ్లుగా మారి ఉన్న స్థలంపై కన్నేశారు. టీడీపీ నేతల అండదండలతో అక్రమంగా అమ్మేసుకున్నారు. పోలీసు స్టేషన్‌ మెట్లెక్కితే.. కోడెల కుటుంబంవైపు దారి చూపారు. అన్యాయం చేశారయ్యా.. మీరే ఆలకించండయ్యా అని కోడెల శివరామ్‌ వద్ద కాళ్లావేళ్లా పడితే కాదు పొమ్మన్నారు. కాసులిచ్చిన వారి వైపే త్రాసు తూచారు. దళితులను కులం పేరుతో దూషించారు. ఊళ్లో ఉంటే ఊపిరి కూడా ఉండదని బెదిరించారు.  చట్టాలు అధికారపు మోచేతి కింద మోకరిల్లగా.. ఇక చేసేది లేక కన్న ఊరు, సొంత గూడు వదిలి కన్నీటితో కదిలిపోయారు ఆ దళితులు.. ప్రభుత్వం మారడంతో తమ వేదన ఆలకిస్తారనే ఆశతో నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇలా రోజురోజుకు కోడెల కుటుంబం అక్రమాలు, అన్యాయాలకు బలైన అనేక మంది పోలీసు గడప తొక్కుతున్నారు.  

నరసరావుపేట టౌన్‌: విలువైన స్థలాన్ని టీడీపీ నాయకుల సహాయంతో బంధువులు ఆక్రమించి అమ్ముకున్నారు.. న్యాయం చేయాలని కోడెల కుటుంబ సభ్యుల వద్దకు వెళితే బెదిరించి కులం పేరుతో దూషించారు.. ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా తిరిగి తమపైనే కేసులు పెడతామన్నారు.. భయంతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లి ఇతర ప్రాంతంలో బతుకుతున్నాం... ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని ఓ దళిత మహిళ శుక్రవారం పోలీసుల ఎదుట వాపోయింది. వివరాలు.. కందుకూరి బుజ్జి వెంకాయమ్మ కుమారుడు రాజేష్‌వర్మకు అతని తాత  షాలెంనగర్‌ ప్రాంతంలో 2.5 సెంట్ల భూమిని సుమారు 17 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేశాడు. అయితే, వాస్తవాన్ని దాచి స్థలంలో సగ భాగం తనకు హక్కు ఉందని 2006లో వెంకాయమ్మ మరిది చంద్రశేఖర్‌ ఇతరులకు 1.25 సెంట్ల భూమిని విక్రయించాడు. మిగిలిన స్థలంలో ఉన్న ఇంటిపై పెద్ద బావ శ్రీనివాసరావు కన్నేసి తనదిగా చూపి అతని కుమారుడికి 2014లో రాసిచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకాయమ్మ ఇదేమిటని ప్రశ్నించించడంతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.

ఈ క్రమంలో వెంకాయమ్మ  వ్యతిరేక వర్గం టీడీపీ నాయకులు కుంపటి రవి, గుండాల రవీంద్రల్ని సంప్రదించగా వారి అనుచరులతో ఇంటి వద్దకు వెళ్లి ఖాళీ చేసి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడ్డారు. న్యాయం కోసం మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి వద్దకు వెంకాయమ్మ వెళ్లింది. అయితే, కుంపటి రవి చెప్పినట్లు విని ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయం వివరించి ఫిర్యాదు చేసింది. అయితే. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోగా కోడెల శివరామ్‌ చెప్పినట్లుగా ఊరు విడిచి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. అలా కాదని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తుల్ని వదిలేసి వెంకాయమ్మ కుటుంబంతో సహా ఊరు విడిచి చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి వెళ్లి గత మూడేళ్లుగా అక్కడే జీవిస్తోంది. తెలుగుదేశం నాయకుల అవినీతి, అక్రమాలపై వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో బాధితురాలు ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందన్నా ఆశతో శుక్రవారం వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

 అట్రాసిటీ కేసు నమోదు 

కులం పేరుతో దూషించి తమ ఆస్తిని అక్రమంగా కాజేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి, వారి అనుచరులు అరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏ.వి. బ్రహ్మం శుక్రవారం తెలిపారు. కాగా ఇప్పటికే కోడెల కుటుంబ సభ్యులపై 13 క్రిమినల్‌ కేసులు నమోదవ్వగా శుక్రవారం మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే కోడెల శివరామ్‌ వేధింపులతో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేసే దివ్యాంగుడు కృష్ణారావు ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరగా.. దళిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిన సంఘటన ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వచ్చాయి.  

మరిన్ని వార్తలు