ఆ గట్టునొకరు ఈగట్టునొకరు

5 Dec, 2018 12:32 IST|Sakshi

ఏయూ ఉద్యోగుల గోడుపట్టించుకోరు

వారం రోజులుగా దీక్షలు

చేస్తున్నా పట్టని మంత్రి గంటా, ఎమ్మెల్యే వెలగపూడి

రాజకీయంగా పొసగకే దూరం దూరం

వర్సిటీ అధికారులదీ అదే తీరు

ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. ప్రజాప్రతినిధులే.. తమ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న వారే..కానీ ఎవరికివారు నాకెందుకులే.. అన్న భావనతో నిర్లిప్తత వహిస్తున్నారు. కారణం.. వారిద్దరికీ పొసగకపోవడమే.. ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావు కాగా.. రెండోవారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.వారిద్దరి మధ్య విభేదాలకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి లింకేమిటి? అన్న సందేహం రావచ్చు..లింకు ఉంది.. ఎలా అంటే.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నవారు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు.. ప్రతిష్టాత్మమైన ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం వెలగపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలోనే ఉంది. ఇక అదే నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి..ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు కలిసి ప్రయత్నిస్తే.. ఏయూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం పెద్ద విషయం కాదు.. అయినా వారిద్దరి మధ్య విభేదాల కారణంగా అది సాధ్యం కాదు..

పోనీ.. ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారా అంటే.. అదీ లేదు..
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ఆ క్రెడిట్‌ గంటాకు వెళ్లిపోతుందేమోనని వెలగపూడి.. మంత్రిగా తాను చొరవ చూపితే.. ఆ పేరు వెలగపూడి కొట్టేస్తాడేమోనని గంటా.. ఎవరికి వారు కురచబుద్ధులు ప్రదర్శిస్తుండటంతో ఉద్యమపథంలో ఉన్న ఏయూ ఉద్యోగులు బలవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 28 రోజుల ఉద్యోగులు, టైమ్‌స్కేల్‌ సిబ్బంది గత వారం రోజులుగా ఉద్యమిస్తున్నారు. 28 రోజుల ఉద్యోగులకు టైంస్కేల్‌ కల్పించాలని, టైంస్కేల్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్‌  ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నెలకు రూ.4 నుంచి 8 వేల వరకు, 28 రోజుల ఉద్యోగులకు నెలకు రూ.12,800, టైంస్కేల్‌ ఉద్యోగులకు రూ.18వేల నుంచి రూ.23 వేల వరకు వేతనంగా వర్సిటీ చెల్లిస్తోంది. ఉద్యోగులకు రూ 12,600 కనీస వేతనం చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ వర్సిటీ దీన్ని విస్మరించి తక్కువ వేతనాలు చెల్లిస్తోంది.

ఉద్యోగుల్లో అధికులు ‘తూర్పు’వాసులే
ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్లో అధికశాతం మంది తూర్పు నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఎన్నోమార్లు కలిసి తమ సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. కానీ ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. గత వారం రోజుల్లో రెండుసార్లు మొక్కుబడిగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి వెళ్ళారే గానీ సమస్యల పరిష్కారం దిశగా కనీస యత్నాలు మొదలుపెట్టలేదు. సంబంధిత మంత్రి గంటాతో చర్చిస్తాను అనే మాట కూడా ఆయన నోట వెంట రాలేదు. సమస్యలు పరిష్కారమైతే ఆ క్రిడిట్‌ మంత్రి గంటాకు వస్తుందనే వెలగపూడి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఆందోళనకారుల నుంచే వ్యక్తమవుతోంది. ఇక మంత్రి గంటా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటివరకు ఆయన వర్సిటీ ఉద్యోగుల గోడు వినే ప్రయత్నమే చేయలేదు. వర్సిటీలోని దీక్షా శిబిరానికి రాకపోయినా, జేఏసీ సభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. మంత్రి పిలిస్తే చర్చలకు వెళ్ళేందుకు తాము సిద్ధమని జేఏసీ సభ్యులు ప్రకటించినా గంటా నుంచి పిలుపు రాకపోవడం ఉద్యోగ సంఘాల నేతలను విస్మయ పరుస్తోంది. ఇక గత ఆదివారం వర్సిటీలో జరిగిన పూర్వవిద్యార్థుల సదస్సులోనూ, కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేసిన సత్కార కార్యక్రమాల్లో పాల్గొన్న గంటా పక్కనే అరకొర జీతాలతో ఉద్యమం చేస్తున్న  బోధనేతర ఉద్యోగులను పట్టించుకోకపోవడం గమనార్హం.

ఉద్యోగుల గోడు పట్టని వీసీ, రిజిస్ట్రార్‌
ఉద్యోగులు వారం రోజులుగా  దీక్షలు కొనసాగిస్తున్నా వైస్‌ చాన్సలర్, రిజిస్ట్రార్‌లు ఇప్పటివరకు దీక్షా శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు. వారిరువురే కాదు.. ఉన్నతాధికారులు కూడా దీక్ష శిబిరం జోలికి పోలేదు. వర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు లైజన్‌ అధికారులు ఉంటారు. వీరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని అధికారులకు వివరిస్తుంటారు. వారు సైతం బోధనేతర ఉద్యోగుల శిబిరానికి రాలేదు. దీంతో అధికారుల వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆచార్య వేణుగోపాలరెడ్డి వీసీగా ఉన్న సమయంలో పాలక మండలి నిర్ణయంతో వందలాది మంది ఉద్యోగులకు 28 రోజులు, టైంస్కేల్‌ వర్తింప చేశారు. ప్రస్తుత పాలకులు ఈ దిశగా ఆలోచన చేయకుండా కుంటిసాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. కనీసం బుధవారం జరిగే పాలక మండలి సమావేశంలోనైనా తమ సమస్యలను చర్చించి పరిష్కారదిశగా ప్రకటన చేస్తారేమోనని ఉద్యోగులు భావిస్తున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని ఇప్పటికే ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. ఈ నెల 10న పూర్వవిద్యార్థుల సమావేశం, 19న స్నాతకోత్సవం ఉన్న నేపధ్యంలో వర్సిటీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

దీక్షా శిబిరానికి నేడు విజయసాయిరెడ్డి
ఏయూ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం సందర్శించి సంఘీభావం తెలపనున్నారు.

మరిన్ని వార్తలు