వేలానికి ఎర్ర బంగారం

9 Aug, 2014 03:38 IST|Sakshi
వేలానికి ఎర్ర బంగారం
  • ఈ-టెండర్ కమ్ ఈ-వేలంపద్ధతిలో.. ఎర్రచందనం విక్రయం
  •  జిల్లాలో 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలు విక్రయించేందుకు శ్రీకారం
  •  19న 836.077 టన్నులు.. 22న 584.02 టన్నుల విక్రయానికి ‘ఈ-వేలం’
  •  ఎర్రచందనం విక్రయిస్తే రూ.116.05 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం దుంగల విక్రయానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఎర్రదొంగల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగల్లో తొలిదశలో 4,159 టన్నులను ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో విక్రయించడానికి శుక్రవారం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇందులో మన జిల్లాలో తిరుపతి, భాకరాపేట అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేసిన 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలను కూడా విక్రయించనున్నారు.

    ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మన జిల్లాలో విక్రయించే ఎర్రచందనం దుంగలను కాంట్రాక్టర్లు కనిష్ట ధరలకు కొనుగోలు చేసినా రూ.116.05 కోట్ల మేర ఆదాయం వస్తుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రెండు దశాబ్దాలుగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను జిల్లాలో తిరుపతి, భాకరాపేట, చిత్తూరులోని అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేశారు. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో వాటి విక్రయానికి అడ్డంకిగా మారింది. ఏళ్లుగా నిల్వ చేయడం వల్ల ఎర్రచందనం దుంగలకు చెదలు పట్టింది. ఎండకు ఎండి.. వానకు తడిచి పాడైపోయాయి.

    రాష్ట్రంలో భారీఎత్తున ఎర్రచందనం దుంగల నిల్వలు పేరుకుపోవడంతో గత ఏడాది నవంబర్‌లో వాటి విక్రయానికి కేంద్రం అనుమతిని ప్రభుత్వం కోరింది. ఇందుకు కేంద్రం సమ్మతించింది. రాష్ట్ర విభజన.. ఎన్నికల నేపథ్యంలో ఎర్రచందనం దుంగల విక్రయానికి అప్పట్లో బ్రేక్ పడింది. ఇప్పుడు విక్రయానికి ప్రభుత్వం తెరతీసింది. రాష్ట్రంలో 4,159 టన్నుల ఎర్రచందనం దుంగల విక్రయానికి శుక్రవారం ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.

    ఇందులో మన జిల్లాలో తిరుపతి, భాకరాపేట గోదాముల్లో నిల్వ చేసిన 1420.097 టన్నులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాలో విక్రయించనున్న 1420.097 టన్నుల ఎర్రచందనం దుంగలను 53 లాట్లుగా విభజించారు. ఈనెల 19న 30 లాట్లలోని 836.077 టన్నులు, 22న 23 లాట్లలోని 584.02 టన్నుల విక్రయానికి టెండర్ షెడ్యూలు దాఖలు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అదేరోజున ఆ లాట్లలోని ఎర్రచందనం దుంగలను ఈ-వేలం పద్ధతిలో గరిష్ట ధరకు కోట్ చేసిన వారికి విక్రయిస్తారు.

    తిరుపతి, భాకరాపేటల్లో నిల్వ చేసిన 53 లాట్లలోని ఎర్రచందనం దుంగలను ఈనెల 11 నుంచి 17 వరకు కాంట్రాక్టర్లు, కొనుగోలుదారులు పరిశీలించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లాలో తొలిదశలో విక్రయించే ఎర్రచందనం దుంగల్లో ఏ-గ్రేడ్ నాణ్యత కలిగినవి కేవలం 4.691 టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం పేర్కొన్న మేరకు టన్ను రూ.12 లక్షల కనిష్ట ధరకు కోట్ చేసినా.. వీటి విక్రయం ద్వారా రూ.56.29 లక్షల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇక బి-గ్రేడ్ నాణ్యత ఉన్న దుంగలు 106.082 టన్నులు ఉన్నాయి.

    బి-గ్రేడ్ ఎర్రచందనం దుంగలకు టన్నుకు కనిష్ట ధరగా రూ.10 లక్షలను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాంట్రాక్టర్లు ధరలను కోట్ చేసినా బి-గ్రేడ్ దుంగల విక్రయం ద్వారా రూ.10.68 కోట్ల ఆదాయం లభిస్తుంది. జిల్లాలో విక్రయించనున్న దుంగల్లో అత్యధిక శాతం సీ-గ్రేడ్ నాణ్యత ఉన్నవే కావడం గమనార్హం. సీ-గ్రేడ్‌గా వర్గీకరించిన దుంగలు 1310.197 టన్నులు ఉన్నాయి. టన్ను సీ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల కనిష్ట ధరగా రూ.8 లక్షలను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాంట్రాక్టర్లు ధరను కోట్ చేసినా సీ-గ్రేడ్ దుంగల విక్రయం ద్వారా రూ.104.81 కోట్ల ఆదాయం వస్తుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. జిల్లాలో ఎర్రచందనం దుంగల విక్రయం ద్వారా తొలి దశలో కనిష్ఠంగా రూ.116.05 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు