ఉక్కిరిబిక్కిరి..!

9 Mar, 2018 12:35 IST|Sakshi
డీడీల తనిఖీ నేపథ్యంలో అనారోగ్యంగా ఉన్నా విధులకు హాజరైన సబ్‌రిజిస్ట్రార్‌ ప్రసాదరావు

 రిజిస్ట్రేషన్‌ శాఖలో ముమ్మర తనిఖీలు

గుంటూరు జిల్లా రేపల్లెలో ఒకే డీడీతో 33 రిజిస్ట్రేషన్లు

మోసాలు గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీడీల తనిఖీలు

జిల్లాలో 32 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రేయింబవళ్లు పరిశీలనలు

తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న అధికారులు, సిబ్బంది

సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రిజిస్ట్రేషన్‌శాఖలోని అధికారులు, సిబ్బంది పరిస్థితి. ఎక్కడో గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవకతవకలు జరిగితే, అదే విధంగా ఎక్కడైనా జరిగి ఉంటుందేమోనన్న అనుమానంతో అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యా ్చయాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రేపల్లె సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకే డిమాండ్‌ డ్రాఫ్ట్‌(డీడీ)పై 33 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు రుజువు కావడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు డీడీల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయిస్తున్నారు. ఆ మేరకు మన జిల్లాలోని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలోని 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఆయా కార్యాలయాల సిబ్బంది డీడీల సమగ్ర సమాచారం యుద్ధప్రాతిపదికన ఓ నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు.

జిల్లాలో 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు..
2017 ఏప్రిల్‌ నుంచి 2018 జనవరి వరకు రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 67,271 డాక్యుమెంట్లు, గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 2018 ఫిబ్రవరి వరకు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలోని 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 76,995 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇందులో దాదాపు 25 శాతం డాక్యుమెంట్లకు డీడీల రూపంలో నగదు చెల్లింపులు జరిగాయి. మిగతా డాక్యుమెంట్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చలానా తీయడం ద్వారా జరిగాయి. పెద్దనోట్ల చెలామణి రద్దు చేసిన సమయంలో బ్యాంకులకు చలానా తీయబోమని కరాఖండిగా చెప్పి డీడీలు కట్టించుకున్నారు. ఈ సమయంలో ఎక్కువగా డీడీల ద్వారా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

డీడీల ద్వారా రిజిస్ట్రేషన్లు ఇలా..
రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు ప్రభుత్వానికి చలానా లేదా డీడీ రూపంలో పన్నును చెల్లిస్తారు. డీడీల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్‌లో మొదట తాత్కాలిక నంబర్‌పై రిజిస్ట్రేషన్‌ చేసి, ఆ డీడీ బ్యాంకు వెళ్లి ప్రభుత్వ ఖజానాకు నగదు జమైనట్టు రసీదు వచ్చాక ఆ డాక్యుమెంటుకు ఒరిజనల్‌ రిస్ట్రేషన్‌ నంబర్‌ ఇస్తారు. ఇప్పుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డీడీ, దాని తాలుకూ డాక్యుమెంట్, నగదు జమ ఎప్పుడైంది, దాని రసీదు నంబర్‌ తదితర సమాచారంతో స్థానిక సిబ్బందే నివేదిక తయారు చేస్తున్నారు.

అనారోగ్యంతోనే విధుల నిర్వహణ
ఈ నెల 2వ తేదీ నుంచి ఉన్నతాధికారుల నుంచి సబ్‌రిజిస్ట్రార్లు, సిబ్బంది అంతా డీడీలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాధారణ పనులతోపాటు డీడీల నివేదిక చేస్తుండడంతో అధికారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి సబ్‌రిజిస్ట్రార్‌ జేవీవీ ప్రసాదరావు తీవ్ర అనారోగ్యానికి గురై ఇంటి వద్ద సృహ తప్పారు. అందరికీ సెలవులు రద్దు చేయడంతో చికిత్స తీసుకుని వెంటనే విధులకు హాజరయ్యారు. సబ్‌ రిజిస్ట్రార్లపైనే డీడీల తనిఖీ బాధ్యత పెట్టడంతో అనారోగ్యంగా ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ కొంత మంది అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లా డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్లు కూడా వ్యక్తిగత కార్యక్రమాలు, శుభకార్యాలకు కూడా గౌర్హాజరవుతున్న పరిస్థితి నెలకొంది.

>
మరిన్ని వార్తలు