అధికారులదీ అదే జపం

19 Jun, 2015 08:19 IST|Sakshi
అధికారులదీ అదే జపం

కందుకూరు అర్బన్( ప్రకాశం జిల్లా):  కందుకూరు మున్సిపాలిటీలో అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదం. మున్సిపాలిటీ ఏమైపోయినా ఫర్వాలేదు... వారు చెప్పినవారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలను సైతం లెక్కచేయకుండా అడ్డగోలుగా అప్పగిస్తున్న వైనంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలకతీతంగా పని చేయాల్సిన కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు మున్సిపాలిటీలో శానిటేషన్, ఇంజినీరింగ్, కంప్యూటర్ ఆపరేటర్లు  టెండర్ల గడువు మార్చినాటికి ముగిసింది.  అధికారులు 2015-16 సంవత్సరానికి మార్చి 23న టెండర్లు పిలవగా శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లకు సాయి హెచ్‌ఎల్‌సీసీఎస్ (ఓగూరు), ఆర్‌ఎస్‌ఎంఎల్‌సీసీఎస్ (దూబగుంట) మార్చి 30వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిర్స్ ప్రతినిధులు టెండర్లు వేశారు.

టెండరుదారుల్లో అధికారపార్టీకి చెందిన వారు లేకపోవడంతో సరైన ధ్రువపత్రాలు లేవని రదు ్దచేస్తున్నట్లు ప్రకటించారు.         గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి పట్టం ఏప్రిల్  నెలలో కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ 2 శాతం ఎక్కువుగా టెండరు వేసింది. వెల్ఫేర్ అసోసియేషన్ 4.94 శాతం ఎక్కువకు టెండర్లు వేసింది. రెండు నెలలు తరువాత మళ్లీ సరైన పత్రాలులేవంటూ డీఈ సుబ్రమణ్యం, కమిషనర్ ఎస్‌వీ రమణకుమారిలు ప్రకటించి ఆ రెండు టెండర్లను తిరస్కరించారు. రెండు రోజుల తరవాత గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి చెందిన 4.94 ఎక్కువ శాతం వేసిన వెల్ఫేర్ అసోసియేషన్‌కి కట్టబెట్టి తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. ఒంగోలు ఇన్‌చార్జిగా ఆర్డీఓ మే 2వ తేదీన ఫీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిస్ టెండర్ల దారులకు ఫోన్ చేసి నిబంధనల ప్రకారం టెండరు ఖరారు చేసినట్లు చెప్పారు.

తరువాత కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడంతో  తరువాత సీన్ రివర్స్ అయింది. తక్కువ శాతం వేసిన టెండరును పక్కన పెట్టేసి ఎక్కువ శాతం టెండరును ఎలా ఓకే చేస్తారని పీఎస్ మ్యాన్‌పవర్ టెండరు ప్రతినిధులు నిలదీసినా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ఈ చర్యలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ  పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా సమర్పించినా రద్దుచేసి, డీఈ, కమిషనర్ సంబంధంలేని సమాధానాలు చెబుతున్నారని టెండరుదారుడు వాపోతున్నారు. ఒకసారి టెండరు రద్దుచేసిన తరువాత మళ్లీ టెండర్లు పిలవాలని నిబంధనలున్నా మూడో కంటికి తెలియకుండా టెండర్లు దఖలు పరచడం వెనుక అంతరార్థమేమిటని పురపాలిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కంప్యూటర్ టెండరుతోపాటు ఏప్రిల్ 27వ తేదీన ఓపెన్ చేసిన శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లను రద్దు చేశారు. ఆ టెండర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తా : ఎమ్మెల్యే పోతుల
 
కందుకూరు మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆపరేటర్ విభాగానికి వేసిన టెండరు పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రద్దుచేసి గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తికి కట్టపెట్టిన కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్‌అధికారులకు ఫిర్యాదు చేస్తా. స్థానిక రోడ్లు,భవనాల శాఖ అతిధి గృహానికి వచ్చిన ఎమ్మెల్యేకు పి.ఎస్. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ తరుపు టెండరుదారులు కలిసి సమస్యను వివరించారు. ఇన్‌చార్జి ఆర్డీఓ నిబంధనల ప్రకారం టెండరు ఖారారు చేసినా ఇందుకు భిన్నంగా అధికారపార్టీకి అనుకూలమైన వారికి టెండరు ఖరారు చేశారని వాపోయారు.

దీనికి ఎమ్మెల్యే  స్పందిస్తూ టెండర్లు రద్దుచేశామని చెప్పిన తరువాత మళ్లీ టెండర్లు పిలిచి ఇవ్వాల్సిన కనీస బాధ్యత కమిషనర్‌కు ఉందన్నారు.  నిబంధనలు  తుంగలో తొక్కి మున్సిపాలిటీకి నష్టం జరిగే చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. శానిటేషన్,ఇంజనీరింగ్ టెండర్లను కూడా పదేపదే రద్దుచేయడం మంచిపద్దతి కాదన్నారు. మున్సిపల్ అభివృద్ధికి దోహదపడాల్సిన కమిషనర్ ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న విధానం మంచిది కాదన్నారు.

మరిన్ని వార్తలు