కుప్ప కూలిన బతుకులు

24 Jun, 2018 08:20 IST|Sakshi
సంఘటనా స్థలంలో పడి ఉన్న క్షతగాత్రులు 

వారు రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. కూలి పనులే వారికి ఉపాధి. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్లి తిరుగు పయనం కాగా.. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బి.కోడూరు : బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 మంది ఉపాధి కూలీలు  ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరతామనుకుంటున్న సమయంలో శ్రీరామ్‌నగర్‌ గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పింది.  ఈ ప్రమాదంలో పందీటి వెంకటసుబ్బమ్మ (48), పందీటి ఆదిలక్షుమ్మ (28) అనే మహిళలపై ఆటో బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని బద్వేలులోని ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లగా అప్పటికే వెంకటసుబ్బమ్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిలక్షుమ్మను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆదిలక్షుమ్మకు భర్త ఓబులేసు, అవినాష్‌ (4), అఖిల్‌ (2), లక్ష్మి (3 నెలలు) పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు.  ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన లక్కినేని శేఖర్‌ అనే వ్యక్తికి కాలు విరిగిపోగా, పందీటి అచ్చమ్మకు తలకు తీవ్ర గాయమైంది. లక్కినేని లలితమ్మకు నడుం భాగం, తలకు తీవ్ర గాయాలు కాగా నాగిపోగు పోలమ్మ, లక్కినేని నారాయణమ్మ, పందీటి ఓబులమ్మ, పందీటి రాజా, అట్లూరు గోపాలయ్య, పందీటి చిన్నయ్య, నాగిపోగు గుర్రమ్మ, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని కడప రిమ్స్‌కు తరలించారు. వీరిలో నాగిపోగు పోలమ్మ, అట్లూరు గోపాలయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్‌ చేశారు.

మృతులు, క్షతగాత్రులు అంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీడీఓ మల్లన్న, మండల తహసీల్దారు దుగ్గిరెడ్డి, ఏపీఓ నాగిరెడ్డి, బి.కోడూరు ఎస్‌ఐ బాలమద్దిలేటిలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, వైవీయూ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, డ్వామా పీడీ హరిహరనాథ్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బోరెడ్డి శేషారెడ్డి, నాయకులు బోడి రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మున్నెల్లి సర్పంచు ఓ.రమణారెడ్డిలు పరామర్శించి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు బి.కోడూరు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన 108 వాహనం
ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినా సరైన సమయంలో అంబులెన్స్‌ రాలేదు. దీంతో క్షతగాత్రులంతా రోడ్డుపై అలాగే పడిపోయి ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు వాహనాలలో కొంత మందిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్‌ వచ్చి ఉంటే వెంకటసుబ్బమ్మ, ఆదిలక్షుమ్మలు మృతిచెంది ఉండేవారు కాదని గ్రామస్తులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు