ఆటోడ్రైవర్‌ నిజాయితీ

5 Sep, 2019 11:44 IST|Sakshi
ఆటోడ్రైవర్‌ను అభినందిస్తున్న ఎస్పీ

సాక్షి, విజయనగరం: జిల్లాలో ఓ బాధితురాలు పోగోట్టుకున్న ఐదు తులాల బంగారు నగలు ఆటో డ్రైవర్‌ నిజాయితీతో పోలీసుల చొరవతో సంబంధిత వ్యక్తికి చేరాయి. ఎస్పీ బి.రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆటోడ్రైవర్‌ను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన గుమ్మ గౌరి రెండు రోజుల క్రితం తగరపువలస నుంచి విజయనగరానికి తన భర్తతో కలిసి మోటారు సైకిల్‌పై వస్తుండగా, మార్గంలో  కురిసిన భారీ వర్షంతో ఆమెను, పిల్లలను, లగేజ్‌తో సహా విజయనగరం వెళ్తున్న ఆటోలో ఎక్కించారు. ఆటో విజయనగరం చేరుకున్న తర్వాత తన సొంత ఊరు వెళ్లే క్రమంలో గౌరి తన వెంట తీసుకువచ్చిన లగేజ్‌ను ఆటోలోనే విడిచిపెట్టి తొందరలో వెళ్లిపోయారు.

ఆటో డ్రైవర్‌ రాజాపులోవకు చెందిన కొత్త శ్రీను ఆటోలో లగేజ్‌ను పరిశీలించి, అందులో గల బంగారు నగలను గుర్తించి, వన్‌టౌన్‌ పోలీసులకు బ్యాగ్‌ను అందజేసి, విషయాన్ని తెలియజేశాడు. బ్యాగ్‌ను పరిశీలించిన వన్‌టౌన్‌ పోలీసులు బాధితురాలి కుమార్తె చిత్తు పుస్తకంలో రాసుకున్న ఫోన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి ఆటోలో విడిచిపెట్టిన సదరు బ్యాగ్‌ గౌరిదిగా గుర్తించి అందజేశారు. సీఐ ఎర్రంనా యుడు ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ రాజకుమారి ఆటోడ్రైవర్‌ శ్రీనును జిల్లా పోలీసు కార్యాలయానికి రప్పించి అభినందించారు. ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు, ఎస్‌బీ డీఎస్పీ సిఎం.నాయుడు, ఎస్‌బీ సీఐ కె.దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు