వివాహితను వ్యభిచార కూపానికి విక్రయించిన ఆటో డ్రైవర్

3 Sep, 2013 01:04 IST|Sakshi

 ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: వ్యభిచార కూపం నుంచి పోలీసులు ఓ వివాహితను రక్షించి ఇద్దరు మహిళలతో పాటు ఓ ఆటో డ్రైవర్‌ను రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే వివాహిత(22)ను స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగించే శ్రీను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ‘నిన్ను బాగా చూసుకుంటాను.. బంగారు నగలు చేయించి మంచి చీరలు కొనిస్తా’నని నమ్మబలికాడు. దీంతో సదరు యువతి శ్రీనుకు ఆకర్శితురాలైంది. శ్రీను ఆమెను గత నెల 7న మండల పరిధిలోని మేడిపల్లికి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు అంతకుముందే పరిచయం ఉన్న విజయలక్ష్మి అలియాస్ అనురాధ, సంతోషి అనే మహిళలకు ఆమెను రూ.9,500 లకు విక్రయించాడు. సదరు మహిళలు వివాహితను అదేనెల 9న విశాఖపట్నం తీసుకెళ్లారు.
 
  శ్రీను వివాహితకు ఫోన్ చేసి తాను రెండురోజుల్లో వస్తానని నమ్మించాడు. మహిళలు ఆమెను ఓ వ్యభిచార గృహంలో ఉంచారు. అది నచ్చకపోవడంతో వారిని ఇబ్బందులకు గురిచేసింది. తాము శ్రీను వద్ద రూ.9,500 పెట్టి కొన్నాం.. చెప్పినట్లు నడుచుకోవాలని అసలు విషయం చెప్పడంతో వివాహిత ఖంగుతిన్నది. ‘మీ డబ్బులు మా కుటుంబీకుల ద్వారా ఇప్పిస్తాను.. నన్ను వదిలేయండి’ అని వివాహిత వారిని ప్రాధేయపడింది. తన కుటుంబీకులతో విషయం చెప్పి డబ్బు ఏర్పాటుపై వారితో మాట్లాడించింది. అనంతరం విజయలక్ష్మి, సంతోష్ ఓ బ్యాంకు అకౌంట్ నంబర్‌ను వివాహిత కుటుంబీకులకు సెల్ ద్వారా ఎస్సెమ్మెస్ పంపారు. దీని ద్వారా వారు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు విశాఖపట్నం వె ళ్లారు.  అక్కడ వ్యభిచార గృహంపై అక్కడి పోలీసుల సహాయంతో దాడి చేశారు. వివాహితకు విముక్తి కలిగించి గతనెల 29న ఘట్‌కేసర్‌కు తీసుకొచ్చారు. వివాహితను కొనుగోలు చేసిన మహిళలు పరారయ్యారు. మండల పరిధిలోని మేడిపల్లిలో ఉంటున్న విజయలక్ష్మి, సంతోష్‌లు గతనెల 31న అద్దె ఇల్లు ఖాళీ చేస్తున్నారనే సమాచారంతో ఘట్‌కేసర్ పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. రాజీవ్ గృహకల్పలో శ్రీనును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ముగ్గురూ నేరం అంగీకరించారు. మహిళలతో పాటు శ్రీనును సోమవారం రిమాండుకు తరలించారు.
 
 

>
మరిన్ని వార్తలు