మైనర్‌పై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

9 Nov, 2013 04:47 IST|Sakshi

 ఇంకొల్లు, న్యూస్‌లైన్ :  పద్నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇంకొల్లు పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మసముద్రం ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్రా వీరాస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే బాలిక తల్లి మృతి చెందటంతో అమ్మమ్మ,తాతయ్యల వద్దే ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆటో డ్రైవర్ వీరాస్వామి వెళ్లి మంచినీరు అడిగాడు. తెలిసిన వ్యక్తి కావటంతో బాలిక వంటింట్లోకి వెళ్లింది. వెనక నుంచి ఇంట్లోకి వచ్చిన వీరాస్వామి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక పెద్దగా అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం పొలం నుంచి వచ్చిన అమ్మమ్మ,తాతయ్యలకు విషయం చెప్పింది. బాలిక తండ్రి గురువారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ కైలాస్‌నాథ్ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు