ఆటోవాలా.. సేవలు భళా..

3 May, 2019 12:52 IST|Sakshi
నిరుపేద బాలింతలకు పాత బియ్యం, గానుగ నూనె అందిస్తున్న సంఘం సభ్యులు

అత్యవసర సమయాల్లో కీలక సేవలు

గర్భిణులు, బాలింతలకు చేయూత

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సేవ చేయాలనే తపన ఉంటే చాలు డబ్బు లేకున్నా ఎదుటి వారికి సహాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడీ ఆటోవాలా. రోజస్తమాను ఆటో నడిపితే కేవలం ఇంటి ఖర్చులు, ఆటో నెలవారీ వాయిదా కట్టుకోవడానికే ఇబ్బందులు పడుతున్న ఈయన ఎదుటి వారికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదెలా అని అనుకుంటున్నారా? అయితే కాకినాడ వెళ్లాల్సిందే. ఆయన సేవాతర్పతను చూడాల్సిందే.

కాకినాడ ఎస్‌ అచ్చుతాపురం మధురానగర్‌కు చెందిన చెల్లి సుబ్బారావు సుమారు ఎనిమిదేళ్ల క్రితం సెకండ్‌ షో సినిమా చూసి ఆటోపై ఇంటికి వెళుతున్న సయమంలో స్థానిక కరణంగారి సెంటర్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ ఆవేదన చూసి చలించిపోయాడు. భార్య బాధ పడుతుంటే భర్త అతికష్టం మీద ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్తున దృశ్యం అతడి హృదయాన్ని చలింపజేసింది. అప్పటి నుంచి గర్భిణులకు, బాలింతలకు సేవ చేయాలని నిర్ణయించుకొన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునే ఆటోలోనే అత్యవసర సమయాల్లో వారిని ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్తున్నాడు. మరికొందరి సహాయంతో బాలింతలకు ఐదు కిలోల పాత బియ్యం, కేజీ నూనె, ఇతర వస్తువులు ఉచితంగాఅందిస్తున్నాడు.

ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ఆటో సిద్ధం..
అర్ధరాత్రయినా ఒక్క ఫోన్‌ చేస్తే గర్భిణులను ఉచితంగా ఆసుపత్రులకు చేర్చుతున్నారు. సుబ్బారావుతో పాటు ఇతర ఆటోసోదరులు కూడా ఫోన్‌ చేస్తే క్షణాల్లో స్పందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆటో సోదరులు ఉచితంగా గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళుతుంటారు.

ఓ సంఘంగా ఏర్పడి..
గర్భిణులు చేస్తున్న సాయాన్ని చూసిన తోటి ఆటో సోదరులందరూ కలిసి చెల్లి సుబ్బారావు పేరిట ఉచిత సంక్షేమ సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 29 మంది సభ్యులుగా చేరి ప్రతినెలా కొంత మొత్తం సమకూర్చుతున్నారు. రెండు నెలలకోసారి కాకినాడ బోట్‌క్లబ్‌ ఆవరణలో సమావేశం నిర్వహించుకుని సంఘం అభివృద్ధికి చేపట్టాల్సి న సేవా కార్యక్రమాలపై చర్చిస్తారు.

మరిన్ని వార్తలు