బతుకు బండికి భరోసా

16 Mar, 2019 14:11 IST|Sakshi

ఆటో డ్రైవర్లకు జగనన్న అండ

ఏడాదికి రూ.10 వేల సాయం

జగనన్న నిర్ణయంపై డ్రైవర్లలో ఆనందం

అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు.. ఆపై జరిమానాలు.. పెట్రోలు మంటలు.. నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు.. ఇవీ ఆటో డ్రైవర్ల కష్టాలు. పాలకులు మారుతున్నా ఆటో డ్రైవర్ల తలరాతలు మారడం లేదు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఏటా రూ.10 ఆర్థిక సాయం చేస్తామని ఇటీవల ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆటో కార్మికులు, వారి కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సాక్షి, కాకినాడ సిటీ: కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో రెండు మండలాలు, 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 32కి పైగా ఆటో స్టాండ్‌లు ఉండి దాదాపు 14,500 మంది ఆటో డ్రైవింగ్‌పైనే జీవనాధారం పొందుతున్నారు. కొందరు అప్పు చేసి, మరికొందరు వాయిదాలు చెల్లించి ఆటోలు కొనుగోలు చేసి జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా బండి నడుపుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు.

ఇందులోనే పెట్రోల్, డీజిల్, ఆటో మరమ్మతు ఖర్చులు భరించాలి. సొంత ఆటో ఐతే ఇబ్బంది లేదు. అదే అద్దె ఆటో అయితే సంపాదనలో రూ.300 వరకు అద్దె చెల్లించాలి. ఫైనాన్స్‌లో ఆటో తీసుకుంటే ఒకటి రెండు వాయిదాలు కట్టకపోతే వ్యాపారులు వాహనాన్ని తీసుకెళ్లిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్‌ ప్రకటించిన రూ.10వేలు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు ఆటోడ్రైవర్లు.


ప్రమాదాలతో నష్టం
ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారం పడుతోంది. కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోంది. దీనికితోడు సీబుక్, ఎఫ్‌సీ, లైసెన్సులు చూపించకపోతే రవాణా, పోలీసు శాఖ అధికారుల దాడులు తప్పడం లేదు. కేసులతో పాటు జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మార్కెట్‌ ఆశీలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి. ఈఎంఐలు చెల్లించకపోతే ఓవర్‌ డ్యూ చార్జీలు, సర్వీసింగ్‌ చార్జీలు, సర్వీసింగ్‌ చార్జీలు.. ఇలా వాహనం నడుపుతున్న కొద్దీ నష్టాలే తప్ప లాభం అంటూ ఉండదు.


రుణాలివ్వని బ్యాంకులు
ఇంటర్మీడియట్, డిగ్రీలు చదివిన వారు ఉద్యోగాలు రాక ఆటోలు కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఆటోలు కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. దీంతో నిరుద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. డబ్బు సకాలంలో చెల్లించని పక్షంలో దాడులకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు అవుతున్నా, ఇవి పచ్చ చొక్కాలకే పరిమితం కావడంతో నిరుద్యోగులు, ఆటో కార్మికులకు స్వయం ఉపాధి లభించడంలేదు.


జగనన్నతోనే ఆటో కార్మికుల సంక్షేమం
కష్టాలతో సహజీవనం చేస్తున్న ఆటో కార్మికులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆటోలు నడుపుకుంటూ కార్మికులు ఒక్కో సమయంలో ఇంటికి సరుకులు కూడా తీసుకెళ్లలేని పరిస్థితులున్నాయి. అలాంటి మాకు ఏటా రూ.10 వేలు ఇస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆటో కార్మికులందరం కలిసికట్టుగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం.
 – నురుకుర్తి వెంకటరమణ, ఆటోడ్రైవర్, ఇంద్రపాలెం


మేలు జరుగుతుంది
ఆటో నడపడం వల్ల ఏటా ట్యాక్స్‌. ఇతర పత్రాల కోసం రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 వేలు అందిస్తే సహాయం చేసినట్టు అవుతుంది. ఆటోలు అప్పు చేసి కొనుగోలు చేశాం. వడ్డీలు, అసలు కట్టాలంటే అందుకు తగ్గ బేరాలు లేవు. రోజుకు రూ.500 సంపాదించాలన్నా కష్టమే.
 – బోడిశెట్టి సత్యనారాయణ, ఆటోడ్రైవర్, కాకినాడ


ఆనందంగా ఉంది
ఆటో డ్రైవర్‌ల కష్టాలు తెలుసుకుని రూ.10 వేలు సహాయం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది అమలు చేయాలి. అప్పుడే సార్థకత చేకూరుతుంది. జగన్‌ మాట ఇస్తే అమలు చేస్తారు. కాబట్టి ఇది ఆటో కార్మికులకు ఎంతో మేలు చేసినట్టే. ఇలాంటి నిర్ణయాలు సాహసోపేతం. అందరూ ప్రకటించలేరు.
– కొక్కిరి విజయకుమార్, ఆటోడ్రైవర్, కాకినాడ


రుణపడి ఉంటాం
ఆటో డ్రైవర్లపై ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ కేసులు నమోదు చేయడం తప్పితే వరాలు ఇచ్చిన వారు ఎవరూ లేరు. అలాంటిది జగనన్న మా కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా బాధను అర్థం చేసుకున్నందుకు జగన్‌కు రుణపడి ఉంటాం.
– ఆర్తి రాజు, ఆటోడ్రైవర్,  కాకినాడ


రూ.10 వేలు ఆసరాగా ఉంటుంది
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇది మాలాంటి పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనకు ఆటో డ్రైవర్లు రుణపడి ఉంటారు.
 –కె.చిన్నా, కాకినాడ


ఏటా ఇన్సూరెన్స్‌ కట్టుకుంటాను
ఆటోలకు ఏటా రూ.8 వేల వరకు ఇన్సూరెన్స్‌ కట్టాల్సి వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్టు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందితే ఇన్సూరెన్స్‌ కట్టినా ఇంకా రూ.2 వేలు వరకు ఆటో డ్రైవర్లకు మిగులుతుంది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లను ఎవరూ పట్టించుకోలేదు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి. ఆయన ప్రకటించిన హామీలు అమలు కావాలి.
–ఎస్‌కే జిలానీ, కాకినాడ


జగనన్న నిర్ణయం హర్షణీయం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటో కార్మికులకు ఏటా రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషదాయకం. ఈ హామీపై ఆటో కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వస్తే బాధలు తీరుతాయని 
ఆశిస్తున్నాం.
 – గొట్టుముక్కల రాజు, కాకినాడ


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా