ఆకస్మిక గుండెపోటు నుంచి రక్షణ!

1 Dec, 2017 10:26 IST|Sakshi

జనసమ్మర్థ ప్రాంతాల్లో ‘ఏఈడీ’ల ఏర్పాటు

వైద్యశాఖ నిర్ణయం.. నిర్వహణ బాధ్యత సంస్థలదే  

సాక్షి, అమరావతి: ఆకస్మికంగా గుండెపోటు బారిన పడిన వారిని కాపాడేందుకు ఉద్దేశించి జనసమ్మర్థ ప్రాంతాల్లో ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌(ఏఈడీ–ఎలక్ట్రిక్‌ షాక్‌ యంత్రాల)ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యశాఖ నిర్ణయించింది. గుండె జబ్బులవల్లే దేశంలో అత్యధికులు చనిపోతున్నారని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ మరణాల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా పబ్లిక్‌ ప్రదేశాల్లో జనరక్ష పథకం కింద ఏఈడీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి? నిర్వహణ ఖర్చులు ఎవరు భరించాలి? ఎలా నిర్వహించాలి? అనే అంశాల్ని వివరిస్తూ మార్గదర్శకాలతో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీవో జారీచేశారు.

సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే డాక్టర్‌ అందుబాటులో ఉండరు. ఇలాంటప్పుడు తక్షణమే ఏఈడీతో ఎలక్ట్రిక్‌ షాకిస్తే గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభిస్తుంది. తర్వాత వీలైనంత త్వరగా బాధితుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించడంద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఏఈడీలతో షాక్‌ ఇవ్వడానికి వైద్య నిపుణులక్కర్లేదు. పారామెడికల్స్‌ కూడా లేకుండా ఒకటి, రెండు సార్లు చూసినవారు(స్వల్ప శిక్షణ పొందినవారు) కూడా ఏఈడీని ఆపరేట్‌ చేయొచ్చు.

ఈ ఉద్దేశంతోనే ప్రైవేట్‌ కంపెనీలు, బ్యాంకులు, జిమ్స్, స్టేడియాలు, బస్సు డిపోలు, క్లబ్‌లు, సామాజిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, షాపింగ్‌మాల్స్‌తోపాటు ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం తప్పనిసరని వైద్యశాఖ పేర్కొంది. అయితే వీటి నిర్వహణ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత ఆయా భవనాలు/సంస్థల యజమానులదేనని స్పష్టం చేసింది. వీటిని ఏర్పాటు చేసేలా రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీలను పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రోత్సహించాలని కూడా ఆదేశించింది. 

మరిన్ని వార్తలు