ఎంపీల పురిటిగడ్డ.. అవనిగడ్డ

19 Mar, 2019 07:19 IST|Sakshi

సాక్షి, అవనిగడ్డ : దివిసీమ ఎంపీల పురిటిగడ్డ అని చెప్పవచ్చు. జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా అవనిగడ్డ  ఏకంగా ఆరుగురు ఎంపీలను అందించింది. వీరిలో ఐదుగురు మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపికకాగా, మరొకరు తెనాలి పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1952లో మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన కమ్యునిస్టు పార్టీ యోధుడు సనకా బుచ్చికోటయ్య సీపీఐ(ఎంఎల్‌) నుంచి గెలుపొందారు.

1957 ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీ తరుపున, 1967 ఎన్నికల్లో నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన మండల వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1967 ఎన్నికల్లో చల్లపల్లిరాజాగా పిలుచుకునే యార్లగడ్డ అంకినీడు ప్రసాద్‌ కాంగ్రెస్‌ తరుఫున విజయం సాధించారు. బందరు పార్లమెంట్‌కు ఇలా వరుసగా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్‌ నేతలు ఎంపిక కావడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు.

రాష్ట్రంలో మరే ఇతర పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఇలా చరిత్ర లేదు. ఒకే నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్‌ వ్యక్తులు ఎంపీలుగా గెలుపొందిన రికార్డు దివిసీమదే. 1999 ఎన్నికల్లో వక్కపట్లవారిపాలేనికి చెందిన అంబటి బ్రాహ్మణయ్య ఎంపీగా గెలుపొందగా, అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన సింగం బసవపున్నయ్య 1989లో తెనాలి పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న జయపురానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌ని కలుపుకుంటే దివిసీమ ఏడుగురు ఎంపీలను అందించింది.  

మరిన్ని వార్తలు