పారదర్శకంగా ఇసుక పాలసీ

6 Sep, 2019 12:29 IST|Sakshi
అగనంపూడిలో ఇసుక ర్యాంప్‌ను ప్రారంభిస్తున్న మంత్రి అవంతి

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయాలు

ఐదేళ్ల టీడీపీ దోపిడీకి చెక్‌ ఇకపై ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే..

మంత్రి అవంతి శ్రీనివాసరావు

అగనంపూడిలో ఇసుక రీచ్‌ ప్రారంభం

అగనంపూడి (గాజువాక): ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీ రూపొందించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఇసుక దోపిడీని అరికట్టి, పాలసీ ప్రకారం పారదర్శకంగా అందిస్తామన్నారు. అగనంపూడి క్యాన్సర్‌ ఆస్పత్రికి సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఐదేళ్లలో ఇసుక మాఫి యా వేల కోట్లు దోచుకుందని, ప్రస్తుత విధా నం బకాసురులకు మింగుడు పడడం లేదన్నారు.  ఇసుక పాలసీ చారిత్రాత్మకమైందన్నారు. నేటి నుంచి ఇసుకకు కొరత డదని, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ప్రతీ ఒక్కరికీ వారి ఇంటికే నాణ్యమైన ఇసుక చేరుతుందన్నారు.

15 రోజుల్లో మరో మూడు డిపోలు
ఇసుక పాలసీని పకడ్బందీగా తయారు చేయడం వల్ల కొంత జాప్యం జరిగిందని, దీన్ని కూడా రాజకీయం చేయాలని తెలుగుదేశం చూడడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం నగర పరిధిలో రెండు రీచ్‌లు (డిపో)లను ప్రారంభించామన్నారు. రూరల్‌ ప్రాంతంలో మరో పక్షం రోజుల్లో మూడు చోట్ల ఇసుక డిపోలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాయకరావుపేట, చోడవరం, నర్సీపట్నంలలో వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇసుక అందుబాటులో తేవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ విధానం రూపొందించామన్నారు. ఇసుక డిపోల వద్ద ప్రభుత్వ ధర కంటే అధికంగా ఒక్క రూపాయి కూడా డిమాండ్‌ చేయడానికి వీల్లేదన్నారు.

సంక్షేమమే అజెండాగా జగన్‌ పాలన
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ముఖ్య మంత్రి జగన్‌ కంకణం కట్టుకున్నారన్నారు. వంద రోజుల జగన్‌ పాలన అన్ని వర్గాల సంక్షేమమే అజెండాగా సాగిందన్నారు. దీంతో ప్రతిపక్షాలకు పనిలేక పసలేని,  ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరుకున పడేయాలని చూస్తూ.. వారే ఇరుకున పడుతున్నారన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారన్నారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే ఇంటికే రవాణా: కలెక్టర్‌
కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ నేటి నుంచి ఇసుక కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని చెల్లింపులు చేస్తే ఇంటికి ఇసుకను రవాణా చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, 56వ వార్డు నాయకులు వి.వి.ఎన్‌.ఎం.రాజు, జి.పూర్ణానందశర్మ (పూర్ణ), ఇల్లపు ప్రసాద్, నక్కా రమణబాబు, ఏదూరి రాజేష్, పచ్చికోరు రమణమూర్తి, మా మిడి శ్రీను, ప్రగడ వేణుబాబు, సీహెచ్‌.రమణ, దుగ్గపు దానప్పలు తదితరులు పాల్గొన్నారు.

పుష్కలంగా ఇసుక నిల్వలు ,ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు
మహారాణిపేట(విశాఖ దక్షిణం): సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుక కష్టాలు లేకుండా పుష్కలంగా ఇసుక నిల్వలు సిద్ధం చేశారు. చినగదిలి మండలం ముడసర్లోవ ఇసుక నిల్వ కేంద్రం, గాజువాక మండలం అగనంపూడి(ఇ.మర్రిపాలెం) వద్ద ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇసుక కోసం ఆన్‌లైన్‌ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సంప్రదించాలి. మొత్తం 2,397 టన్నుల ఇసుకకు అందుబాటులో ఉంచారు. ఇ.మర్రిపాలెం వద్ద 1623 టన్నులు, ముడసర్లోవ వద్ద 774 టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. డిపోల్లో టన్ను ఇసుకకు 375 రూపాయలు చెల్లించాలి. ఇసుక డిపోల వరకు రవాణా నిమిత్తం టన్నుకు ఒక కిలోమీటర్‌ నాలుగు రూపాయల 90 పైసలుగా నిర్ణయించారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌
ఇసుక కోసం www.sand.ap.gov.in ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించాలి. లేకపోతే సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో కూడ ఇసుక కోసం సంప్రదించవచ్చని మైనింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధార్‌ నం బరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకుని, ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా మొబైల్‌ ఓచర్‌ను పొంది ఇసుకను నిర్ణయించిన ఇసుక డిపోల వద్ద నుంచి పొందాలని ఏడీ తమ్మినాయుడు కోరారు.

మరిన్ని వార్తలు