మరోసారి మెరిసిన ‘పద్మం'!

28 Jan, 2015 10:51 IST|Sakshi
మరోసారి మెరిసిన ‘పద్మం'!

విజయనగరం టౌన్ : విద్యలనగరానికి మరోసారి పద్మ అవార్డు దక్కింది. సంగీత, సాహిత్య కళలకు నిలయమైన జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా వయోలి న్‌లో జిల్లాకు చెందిన అవసరాల కన్యాకుమారిని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 1958లో విజయానంద గజపతిరాజు (సర్ విజ్జీ) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన క్రికెట్ ప్లేయర్‌గా సుపరిచితులు.
 
 భారత్ క్రికెట్ జట్టుకు ఆయన 1936లో కెప్టెన్‌గా వ్యవహరించారు. 1960, 62లో విశాఖ నుంచి లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి గెలిచా రు. అలాగే జిల్లాకు చెందిన వెంకటస్వామినాయుడు కూడా 1957లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయనకు ఏయూ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అలాగే రాజా, లక్ష్మి అవార్డు కూడా దక్కించుకున్నా రు. ఈయన ఘంటశాలకు కర్ణాటక సంగీతం నేర్పారు. తాజాగా అవసరాల కన్యాకుమారికి  కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లా లో మూడో పద్మం మెరిసింది. జిల్లావ్యాప్తం గా సంగీత ప్రియులు ఆమెకు అవార్డు రావ డం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.   
 
 సంతోషం
 కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అవసరాల కన్యాకుమారి తెలిపారు. చెన్నైలో ఉంటున్న ఆమె సోమవారం ఫోన్‌లో సాక్షితో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అద్భుతమై న అవార్డును  కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన గురువులు ప్రోత్సాహం వల్లే ఇంతస్థాయి కి చేరుకున్నానని తెలిపారు.
 
 ఈమె విజయనగరంలోని కొత్త అగ్రహారంలో తన తొలి గురువు ఇవటూరి విశ్వేశ్వరరావు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆయన గురువైన ద్వారం నరసింగరావు పేరున ఏర్పాటు చేసిన పాఠశాలలో తానే తొలి విద్యార్థిని అని తెలిపారు.  సంగీతంలో మరింతగా రాణించాలన్న ఉద్దేశంతో చెన్నైలో వయోలిన్‌లో పట్టా పొందేందుకు వెళ్లి స్థిరపడినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు