ఆ నవ్వుకు నూరేళ్లు

9 Nov, 2013 01:41 IST|Sakshi


 తెనాలిటౌన్/రూరల్, న్యూస్‌లైన్
 పత్రికా రంగం నుంచి సినీ పరిశ్రమలో ప్రవేశించి, అక్కడ ఎదిగిన హాస్యనటుడు ఏవీఎస్. అతి స్వల్పకాలంలో తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఏవీఎస్ నిర్మాతగా, దర్శకునిగా ఎదగాలని తపనపడ్డారు. దర్శకత్వంలో పరిణితి సాధిం చక ముందే అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూయడం జిల్లా కళాకారులను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వెయ్యి సినిమాల మైలురాయి అందుకుంటారని, దర్శకునిగా గొప్ప విజయాలు సాధిస్తారని అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమించి కన్నుమూయడంతో ఆయన స్వస్థలం తెనాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి.
 
 తెనాలిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(ఏవీఎస్) అతికొద్దికాలంలోనే ఉన్నత శిఖరాలను అందుకున్న గొప్పనటుడు. ఇక్కడి వీఎస్‌ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశారు. ఆ కళాశాల  లెక్చరర్ నఫీజుద్దిన్ రాసిన నాటకాల్లో ఏవీఎస్ నటిస్తుండేవారు. రసమయి సంస్థను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరుతెచ్చుకున్నారు. లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండేవారు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు.
 
  ఎన్టీఆర్ శ్రీనాథ సార్వభౌమ సినిమాలో బాపు, రమణలు ఏవీఎస్‌కు మంచి అవకాశం కల్పించారు. చిత్ర విచిత్రమైన మ్యానరిజాలతో ప్రేక్షకుల్ని నవ్వించడం, సెంటిమెంట్‌తో కంట తడిపెట్టించడం ఆయనకే సొంతం. ‘తుత్తి’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఏవీఎస్‌కు 1980లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు, భార్య ఆశాకిరణ్మయి. తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత  ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 450 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరుసంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు.
 
  సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవారు. పుట్టినగడ్డ ఆంధ్రాప్యారిస్ తెనాలికి సేవ చేయాలని ఎప్పుడూ  తపనపడుతుండేవారు. ఇక్కడ ఏషియన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వివేక విద్యాసంస్థల డెరైక్టర్ రావిపాటి వీరనారాయణ సహకారంతో గ్లోబల్ హాస్పటల్ సౌజన్యంతో రెండు సార్లు తెనాలిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెనాలిని సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని కోరుతుండేవారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు