స్వీయ నిర్బంధనతో కరోనా నివారణ

24 Mar, 2020 12:07 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట టౌన్‌ : ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కరోనా వైరస్‌ గురించే చర్చ. ఈ వైరస్‌ ప్రమాదం గురించి తెలిసిన వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈవైరస్‌ కారణంగా చైనా, ఇటలీ దేశాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్‌ రెండో దశలో ఉంది. ఇది మూడో దశకు చేరితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రజల స్వయంకృతాపరాధం వల్ల పొరపాటున వైరస్‌ వ్యాప్తి మూడో దశలోకి చేరుకుంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. కరోనా వైరస్‌ తొలుత చైనా దేశంలోనే విజృంభించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చైనా ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించింది. అక్కడి ప్రజలు కూడా స్వీయనిర్బంధనతో ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు రెండు నెలల పాటు ఇంటిలో ఉన్న కారణంగా కరోనా వైరస్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. 

ఇష్టమున్నా వారి వద్దకు వెళ్లకండి  
తెలుగు ప్రజల్లో అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. ఇందువల్ల అనేక మందిపైన అభిమానాన్ని, ఇష్టాన్ని పెంచుకొని ఉంటారు. అయితే ప్రస్తుతం ఎంత ఇష్టమున్నా వారి వద్దకు అస్సలు వెళ్లొదని చెబుతున్నారు. 

రవాణా సౌకర్యం లేని సమయంలోనే..  
1918వ సంవత్సరంలో ఫ్లూ వైరస్‌ భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఏమాత్రం విమానాల సౌకర్యం లేదు. ఇక షిప్‌లు, రవాణా సౌకర్యం కూడా అతి తక్కువే. అయినప్పటికి ఫ్లూ వైరస్‌ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఫలితంగా ఆ సమయంలో దాదాపు కోటి మందికి పైగా చనిపోయారు. మొన్నటి వరకు రవాణా వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా అందుబాటులో ఉండిందో అందరికీ తెలుసు. ఇందువల్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వీటితో వైరస్‌ నివారణ
వెల్లుల్లి, అల్లం, పసుపు వైరస్‌ను చంపేస్తుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక దేశాలు వెల్లుల్లి, అల్లం, పసుపు వంటివి వాడి వైరస్‌ను నివారించుకున్నాయి. వెల్లుల్లి, అల్లం, పసుపును వాడటంతో పాటు విధిగా తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అలాగే అనవసరంగా మొహం, ముక్కు, కళ్లు తాకకుండా ఉండటం ఎంతో మంచిది. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ కూడా తాకకూడదు.

ఇవి ఏమాత్రం నిజాలు కావు
మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, అలాగే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఈకారణంగా కరోనా వైరస్‌ వ్యాపించదని చాలా మంది విశ్వసిస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. గాలిలోనూ కరోనా వైరస్‌ ఉంటుందని వెల్లడైంది. ఆయుర్వేద, హోమియో, యునాని ఏ ఇతరత్రా పద్ధతులు కూడా కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో నివారించలేవు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే ప్రజలంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి.

మరిన్ని వార్తలు