ఈవీఎంల వినియోగంపై అవగాహన

11 Feb, 2019 13:47 IST|Sakshi
ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ వినియోగంపై జకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్న బెల్‌ కంపెనీ ప్రతినిధి

రెవెన్యూ డివిజన్‌కు 10 ప్రకారం పంపిణీ

రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగం, వీవీ ప్యాట్‌లతో ఉపయోగాలపై జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించి ఆదివారం కర్నూలు శివారు శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ వివిధ అంశాలను వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లను శిక్షణ నిమిత్తం రెవెన్యూ డివిజన్‌కు 10 ప్రకారం పంపిణీ చేశారు. వీవీ ప్యాట్‌లు, బ్యాలెట్‌ , కంట్రోల్‌ యూనిట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో ర్యాండమ్‌గా గోదాము నుంచి తీయించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంల ద్వారా ఓటు ఎలా వేయాలి, వీవీప్యాట్‌ ద్వారా ఓటు సరిగా పడిందా లేదా ఏ విధంగా సరిచూసుకోవాలి తదితర అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్‌లకు పది ప్రకారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు వీటిపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణ జరుగుతున్న సమయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకోవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, డీఆర్వోవెంకటేశం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.  

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించండి
కర్నూలు(అగ్రికల్చర్‌): నియోజకవర్గాల వారీగా తీవ్ర సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, వాటి లోకేషన్‌లు గుర్తించి  బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఈఆర్వోలు, డీఎస్పీలు, తహసీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి  వివిధ అంశాలపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టుల ఏర్పాటుపై సూచనలు ఇచ్చారు. జిల్లాలో 3,780 పోలింగ్‌ కేంద్రాలుండగా 2,180 లొకేషన్‌లున్నాయని, వీటిలో సెన్సిటివ్, హైపర్‌ సెన్సిటివ్‌ లొకేషన్‌లు, పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. సమస్యాత్మక లొకేషన్‌లను బట్టి పోలీసు బందోబస్తు ప్లాన్‌ సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల          సమయంలో నగదు, మద్యం ప్రమేయాన్ని నివారించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పనకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, అడిషనల్‌ ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్‌ఓ వెంకటేశం, పలువురు డీఎస్పీలు  తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు