ధ్రువపత్రాలు పొందండిలా..

1 Jun, 2019 12:53 IST|Sakshi

త్వరలో పాఠశాలల పునఃప్రారంభం

ఉన్నత చదువులు, ఉద్యోగాలకు తప్పనిసరి

ప్రభుత్వ రాయితీలు పొందేందుకూ అవసరం

నూతన విద్యా సంవత్సరం ఈనెలలో ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి పది, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆపై చదువులకు ప్రవేశాలు పొందే వారికి వి«ధిగా కళాశాలల్లో కుల, నివాస ధ్రువీకరణపత్రాలు అందించాల్సి ఉంటుంది. ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చాక హడావుడిగా వీటి కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు తీస్తారు. వారి కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఎలా పొందాలో తెలుసుకుందాం...  – కలసపాడు

కుల ధ్రువీకరణపత్రం
కుల (క్యాస్ట్‌) ధ్రువీకరణపత్రం పొందేందుకు దగ్గరలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుని చిరునామా, ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరిది పాత కులధృవీకరణపత్రం ఉంటే, పాఠశాల, కళాశాలల నుంచి ఇచ్చిన టీసీ పత్రాలు జత చేసి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత సంబంధిత పత్రాలన్నింటిపై వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దార్‌ ధ్రువీకరిస్తారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ అనుమతి ఇస్తారు. అనంతరం మీసేవ ద్వారా సర్టిఫికెట్‌ చేతికి వస్తుంది.

ఈడబ్ల్యూసీ
ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్‌ అంటే ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ సర్టిఫికెట్‌ (ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు) ఈ సర్టిఫికెట్‌ ఓసీ వర్గాలు, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్య, నాయుడు (కమ్మ) తదితర ఉన్నత కులాల వారికి అవసరం ఉంది. వీరు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ ఉంటే ప్రభుత్వం విద్య కోసం ఉపకార వేతనాలు అందజేస్తుంది. దీని కోసం ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, అడ్రస్‌ తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.

ఓబీసీ
ఓబీసీ (అదర్‌ బ్యాక్‌వర్డ్‌ సర్టిఫికెట్‌) సర్టిఫికెట్‌ను పొందేందుకు దరఖాస్తుదారుడు మీసేవ కేంద్రంలో దరఖాస్తు నింపి వాటితో పాటు కులాన్ని సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాలు, ప్రైవేటు ఉద్యోగులైతే వారి వేతన స్లిప్పులు జతపరిచి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయ ధ్రువీకరణపత్రం
ఆదాయ ధ్రువీకరణపత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తును నింపి దాంతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, గుర్తింపుకార్డు పత్రాలను జతచేయాలి. సంబంధిత పత్రాలన్నీ మీసేవ కేంద్రంలో వారు స్కాన్‌చేసి అనంతరం పత్రాలను తహసీల్దారు కార్యాలయానికి పంపుతారు. అక్కడ వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దారు కార్యాలయ సిబ్బంది విచారించి అర్హులకు అనుమతిస్తారు. అనంతరం మీసేవ సర్టిఫికెట్‌ పొందవచ్చు.

నివాస ధ్రువీకరణపత్రం
నివాస ధ్రువీకరణపత్రం కోసం సమీపంలోని మీసేవ కేంద్రాల్లో లభించే దరఖాస్తు ఫారం నింపి దాంతో పాటు అన్ని విద్యార్హత పత్రాలు, బోనపైడ్, చిరునామా పత్రం, గుర్తింపు కార్డులను జతచేయాలి. తిరిగి వాటిని సంబంధిత తహశీల్దారు కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత వీఆర్‌ఓలు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే జారీ చేస్తారు.

గ్యాప్‌ సర్టిఫికెట్‌
మండల తహసీల్దారు కార్యాలయాల్లో గ్యాప్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. విద్యలో వెనుకబడిన విద్యార్థులు అనారోగ్య కారణాలతో చదవలేనివారు, చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి ఉన్నత విద్య చదవాలనుకునేవారు విధిగా దీనిని అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందే వారికి ఇది తప్పనిసరిగా అవసరం. ఈ సర్టిఫికెట్‌ పొందాలంటే రూ.10 స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్‌ (చదువులో ఎందుకు గ్యాప్‌ వచ్చిందో సూచిస్తూ) నోటరీ, ఇద్దరు గెజిటెడ్‌ అధికారుల సంతకాలతో కూడిన పత్రాలు, విద్యార్హత పత్రాలు, అనారోగ్య కారణాలతో చదువులో గ్యాప్‌ వస్తే సంబంధిత మెడికల్‌ పత్రాలు జతచేసి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

గడువు వివరాలు
సర్టిఫికెట్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణీత గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణపత్రం 30 రోజులు, ఆదాయ ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, నివాస ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్‌ ఏడు రోజులు, ఓబీసీ సర్టిఫికెట్‌ 7 రోజులు, గ్యాప్‌ సర్టిఫికెట్‌ను ఏడు రోజుల్లో పొందవచ్చు.

ఎవరినీ ఆశ్రయించాల్సిన పనిలేదు
ధ్రువీకరణపత్రాల కోసం నేరుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దళారులను ఆశ్రయించొద్దు. అన్నీ అవసరమైన పత్రాలు జతచేస్తే నిర్ణీత కాలవ్యవధిలో అందుతాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాల కోసం వెళ్లిన వారు పాత పత్రాలు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరివైనా ఉంటే వాటిని జతచేయాలి. విచారణలో అధికారులకు చాలా సులువుగా ఉంటుంది. సకాలంలో సర్టిఫికెట్‌ త్వరితగతిన చేతికి అందుతుంది.

మరిన్ని వార్తలు