విష రహిత సేద్యం..అందరి కర్తవ్యం

6 Sep, 2019 11:58 IST|Sakshi
ఘన జీవామృతం తయారు చేస్తున్న రైతులు

తక్కువ ఖర్చుతో నేల సారవంతం

ప్రచారం చేస్తున్న రైతు శిక్షణ కేంద్రం అధికారులు

అనకాపల్లి: స్వాభావిక సేద్యం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. అదనపు భారమవుతున్న రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో రైతులే సొంతంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇందుకు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఎడాపెడా రసాయనిక ఎరువుల వినియోగంతో భూములు నిస్సారమవుతున్నాయన్నది గ్రహిస్తున్న రైతులు సహజ ఎరువుల వాడకాన్ని విస్తృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై ‘విషరహిత సేద్యం– మనందరి కర్తవ్యం’ నినాదంతో ప్రచారం చేస్తున్నామని అనకాపల్లి రైతుశిక్షణ కేంద్రం డీడీఏ గీతాశైలజ తెలిపారు. సహజ ఎరువుల వాడకంతో భూమిలోని జీవరాసులు, వానపాములు ఆరోగ్యంగా వ్యాప్తి చెంది భూమి సారవంతమవుతుందన్నారు. పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయని, ఏపుగా పెరిగి మంచి దిగుబడులు ఉంటాయన్నారు. మొక్కలు బలంగా ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని, ఆయా పంటల దిగుబడులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు.

ఘన జీవామృతం తయారీ ఇలా..
ఇది పొడిగా ఉంటుంది. దీనిని గోనెసంచులలో ఆరు నెలలు వరకు నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు  వాడుకోవచ్చు. విత్తే ముందు ఈ మిశ్రమాన్ని బాగా పొడి చేసి వంద కిలోలు బాగా చివికిన ఆవుపేడలో కలిపి పొలంలో జల్లి కలియదున్నాలన్నారు. వంద కిలోల ఆవుపేడ, ఐదు లీటర్ల ఆవుమూత్రం, నాలుగులీటర్ల బెల్లం, నాలుగు లీటర్ల చెరకు రసం లేదా రెండు కిలోల బెల్లం, రెండుకిలోల శనగ లేదా ఉలవ లేదా మినుము లేదా పెసర పిండి, 500 గ్రాముల పొలం గట్టుమన్ను తీసుకుని వీటన్నింటినీ కొద్ది కొద్దిగా ఆవుమూత్రాన్ని జల్లుతూ చేతితో బాగా కలిపి పదిరోజులు నీడలో ఆరబెట్టాలి. ఇలా తయారైన ఘనజీవామృతాన్ని ఆరునెలలు వరకు నిల్వ చేసుకోవచ్చు. పంట దశలో కూడా దీనిని మొక్కలకు వేసుకోవచ్చు. ఈ ఘన జీవామృతాన్ని ఎరువుగా వినియోగించడం ద్వారా పంటకు అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా అందుతాయి. చీడపీడలు, పురుగుల బెడద ఉండదు.

ద్రవ జీవామృతం..
ఇది ద్రవరూపంలో ఉంటుంది. దీనిని 15రోజులకు ఒకసారి నేలకు నీటి ద్వారా అందించడంతోపాటు పంటమీద కూడా నీటిలో కలిపి పిచి కారీ చేసుకోవాలి. పది కిలోల ఆవుపేడ, ఐదు నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, రెండు లీటర్ల చెరకు రసం లేదా రెండు కిలోల బెల్లం, రెండు కిలోల పప్పుల పిండి, 200 లీటర్ల నీరు, దోసె డు పొలంగట్టు మన్ను ఒక తొట్టెలో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. రోజూ 2, 3 సార్లు కర్రతో కుడివైపుకు కలియతిప్పాలి. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని వారం రోజులపాటు వాడుకోవాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ప్రతి 15రోజులకు ఒక సారి ద్రవజీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందిస్తే భూమిలో 10–17 అడుగుల లోతులో నిద్రావస్థలో ఉన్న వానపాములు చైతన్యవంతమై చురుగ్గా పని చేయడం ప్రారంభిస్తాయి. తద్వారా భూమి సారవంతమవుతుంది. నేలలో సహజంగా ఉన్న ఎరువుల మూలకాలను జీవామృతం మొక్కలకు పుష్కలంగా అందించే ఏర్పాటు చేస్తుంది.

మరిన్ని వార్తలు