తూటుకాడ మొక్క.. జర జాగ్రత్త

8 Mar, 2019 13:22 IST|Sakshi
కాలువల వద్ద పెరుగుతున్న తూటుకాడ మొక్కలు

పశువులపై విష ప్రభావాన్ని చూపే తూటుకాడ మొక్క

రైతులు జాగ్రత్తపడకపోతే ప్రమాదం

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమ, పశుపోషణపై ఆధారపడి మెజార్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి. పాడి పరిశ్రమతో ఆదాయం పొందుతున్నాయి. పాడి పశువులను, సాధారణ పశువులను మేత కోసం పొలాల వద్దకు, చెరువు గట్ల వద్దకు, నీటి కుంటల వద్దకు తోలుకుపోతారు. అయితే అక్కడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గడ్డితో పాటు గడ్డి మొక్కగా తూటుకాడ  మొక్కలు అధికంగా ఉంటున్నాయి. ఈ మొక్కలను పశువులు గడ్డితో పాటు తినడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని కడప నగర పరిధిలోని ఆలంఖాన్‌పల్లె పశువైద్యశాల వైద్యుడు గానుగపెంట రచ్చ రాంబాబు  రైతులకు సూచిస్తున్నారు.

తూటుకాడ మొక్క ఉపయోగాలు...
మొక్క కాడను పేపరు పరిశ్రమలలో ఎక్కువగా వాడతారు.
ఆకుల్లో మార్సిలిస్‌ అనే పదార్థం ఉంటుంది. దీన్ని మూర్ఛవ్యాధిలో మత్తు కలిగించడానికి ఉపయోగిస్తారు.
ఆ మొక్కలోని సపోనిన్లు అనే రసాయనిక పదార్థాలను క్యాన్సర్‌ తగ్గించే మందుల్లో వాడతారు.
పుండ్లు మానడానికి, మధు మేహం తగ్గించడానికి, రోగ నిరోధక శక్తి మందుల్లో వాడతారు.
పూర్వపు రోజుల్లో వీటి కాడను పొగాకు గొట్టాలుగా వాడేవారు.

విష ప్రభావం..
ముఖ్యంగా విష ప్రభావానికి కారణం లైసర్జిక్‌ ఆమ్లం.
సాధారణంగా మొక్కలను పశువులు తినవు. కానీ ఒక్కసారి తినడం మొదలుపెడితే అదే అలవాటుగా మారి మత్తు పదార్థానికి బానిసలా మారతాయి. తరువాత మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా తింటాయి. ఆ విధంగా తిన్న 3–4 నెలల్లోపు విషప్రభావం వల్ల చనిపోతాయి.
మేకలు, ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
బ్రెజిల్‌ దేశంలో దీన్ని దెయ్యపు మొక్కగా వర్ణిస్తారు.
మొక్కలో సెలీనియం అధికంగా ఉండడం వల్ల ఆల్లకీ వ్యాధి వస్తుంది.
మొక్కలోని స్కేయిన్సోనైస్‌ పదార్థం వలన తలలోని నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది.

లక్షణాలు..
ఎక్కువగా ప్రతిరోజు తింటే లక్షణాలు కనిపిస్తాయి.
కనుగుడ్లు తిరగడం, నోటి నుంచి నురగ కారడం, పారడం వంటివి ఉంటాయి.
తలను అటు ఇటు ఊపుతూ ఉంటాయి. నరాల బలహీనత అధికంగా ఉంటుంది.
మూర్ఛరావడం, మత్తు వచ్చినట్లు ప్రవర్తించడం, నాలుగు కాళ్లు సమన్వయం లేక గిరికీలు కొట్టడం.అలాంటి స్థితిలో కూడా మొక్కను తెస్తే తినడానికి ప్రయత్నిస్తుంది. అంతగా పశువులు దానికి బానిస అవుతాయి.

చికిత్స..
ఆ మొక్కలు ఉండే దగ్గర మేపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంజక్షన్, అట్రోపిన్‌ సల్ఫేట్‌ 0.1 మిల్లీ గ్రాములు/ కేజీ బరువుకు ఇంజక్షన్, మేగుడైన్‌ 1 మిల్లీలీటరు/10 కేజీల బరువుకు రక్తంలోకి ఇవ్వాలి.
దీనితోపాటు ఇంజక్షన్‌ , మిథైల్‌ కొబాలమయిన్‌ 20 మిల్లీ లీటర్లు, టాబ్లెట్‌ , గాబపెంటిన్‌ 1 మిల్లీ గ్రాములు వాడాలి.
ఇంజక్షన్‌. డీఎన్‌ఎస్‌(5శాతం) ఒక లీటరు, ఇంజక్షన్, రింగర్‌ లాక్టేట్‌ ఒక లీటరు వాడాలి.
పైవన్నీ 3–4 రోజుల్లో వాడాలి. అంతేగాక  పశు వైద్యున్ని సంప్రదించి తప్పక సలహాలను పాటించాలి.

హోమియో వైద్యం...
పారఫిన్‌ లేదా వంట నూనెను తాగించడం వల్ల లేదా నేరుగా పొట్టలోకి ఎక్కించాలి.
వంట బొగ్గును మెత్తగా పాడిచేసి నీటిలోకి కలిపి (5 గ్రాములు లీటరు నీటికి) పెద్ద పశువులకు 5 లీటర్లు, చిన్న పశువులకు అయితే అర్ధ లీటరు తాపించాలి.
10–12 కోడిగుడ్ల తెల్లసొనను, పావు కిలో పంచదారను లీటరు నీటిలో కలిపి 2 రోజులు తాపించాలి.

తూడుకాడ మొక్క ఇది కలుపుమొక్కే...
ఇది ఒక రకమైన కలుపు మొక్క. దీనికి సాగే గుణం ఉండడం వలన దీన్ని రబ్బరు మొక్క అని కూడా అంటారు. కాండం మధ్యలో బొంగులాగా ఖాళీ ఉండి, పూలు లేత ఎరుపు, తెలుపు రంగులో ఉంటుంది. ఎక్కువగా నీరు నిలువ ఉన్న వంకలు, వాగులు, చెరువు, కుంటలు, కాలువగట్ల మీద పెరుగుతుంది. వీటిని పశువులు తినడం వల్ల నరాలకు వ్యాధులుసంభవించి చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని వార్తలు