లాక్‌డౌన్‌కు ముందే అలర్ట్‌

7 Apr, 2020 02:58 IST|Sakshi

నెల్లూరులో తొలి కేసు గుర్తించిన వెంటనే 

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

మార్చి 11 నుంచే కరోనాపై అవగాహన కార్యక్రమాలు 

ఈ మహమ్మారిపై పొదుపు సంఘాల మహిళల ద్వారా విస్తృత ప్రచారం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటనకు చాలా రోజుల ముందే కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ, 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి రాగా దానికి పది రోజుల ముందు నుంచే వైరస్‌ నియంత్రణ చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసును నెల్లూరులో గుర్తించిన వెంటనే అప్రమత్తమై పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్వయం సహాయక (పొదుపు) సంఘాల ద్వారా మహిళలను చైతన్యం చేసి వైరస్‌పై విస్తృత ప్రచారం కల్పించింది. లాక్‌డౌన్‌ మొదలయ్యే నాటికే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనే 53 లక్షల మంది మహిళలకు వైరస్‌పై అవగాహన, నియంత్రణ చర్యల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. 

► ఒకపక్క వలంటీర్ల ద్వారా కరోనా నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే మహిళలను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములుగా చేయడం ద్వారా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది.  
► మార్చి 11వ తేదీనే పొదుపు సంఘాల మహిళల ద్వారా కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం శాఖాపరంగా అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. 
► ప్రతి జిల్లాలోనూ రిసోర్సు పర్సన్స్‌కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శిక్షణ ఇప్పించి పొదుపు సంఘాల జిల్లా సమాఖ్యలకు, మండల సమాఖ్యలకు, గ్రామ సమాఖ్యలకు శిక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ సమాఖ్యలు ఎక్కడికక్కడ పొదుపు సంఘాల మహిళలందరికీ కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంది.
► మార్చి 13వ తేదీన అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో డీఆర్‌డీఏ పీడీలు సమావేశమై కరోనా అవగాహన కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
► మార్చి 16వతేదీ నాటికే పొదుపు సంఘాల జిల్లా సమాఖ్యల స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. 
► జిల్లా సమాఖ్యల్లో అవగాహన పొందిన మహిళలు 17వ తేదీన అన్ని మండల సమాఖ్యల్లో శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేశారు. 
► మార్చి 18వ తేదీన గ్రామ సమాఖ్యలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి. 
► మార్చి 19 నుంచి గ్రామ పరిధిలోని ప్రతి 5 పొదుపు సంఘాలలో మహిళలందరికీ అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి. స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను భాగస్వాములను చేశారు.
► ఇలా రాష్ట్రంలో దాదాపు 53,27,218 మంది మహిళలకు అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యే సమయానికి కరోనా నియంత్రణ చర్యల్లో  భాగంగా భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు 50–60 మందిని ఒక చోట సమావేశ పరిచే కార్యక్రమాలు జిల్లాలో నిలిచిపోయాయి.
► అయితే గ్రామాల్లో అప్పటికే అవగాహన కార్యక్రమం పూర్తయిన వారి ద్వారా మిగిలిన మహిళలను మౌఖిక ప్రచారం ద్వారా చైతన్యం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
► లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కరోనా వైరస్‌పై విస్తృత అవగాహన కల్పించడం వల్ల రాష్ట్రంలో నియంత్రణ చర్యలు సమర్ధంగా అమలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

>
మరిన్ని వార్తలు