'సరదా' వెనుక విషాదం!

23 May, 2020 13:30 IST|Sakshi
గుండ్లకమ్మ గుంతల్లో చేరిన వర్షం నీరు

చిన్నారులకు పొంచి ఉన్న జలగండం

ఈతలో జాగ్రత్తలు పాటించకుంటే మృత్యువాతే

40 రోజుల్లో ఈతకు వెళ్లి సుమారు పది మంది మృతి  

వేసవి కాలం ఈత సరదాతో కొందరు తల్లిదండ్రులకు విషాదం మిగులుతోంది. కరోనా ఎఫెక్ట్‌..లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లో సాయంత్రం వేళ సరదాగా ఈతకు వెళ్లి సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతూతల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు.

ప్రకాశం, మార్కాపురం: సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఈతకు వెళ్లిన వారు మృత్యువాత పడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈత అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. జిల్లాలో గడిచిన 40 రోజుల్లో ఈతకు వెళ్లి సుమారు పది మంది వరకు చనిపోయారు. వినోదం విషాదంగా మారింది. ఈత కొట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో కొత్తపట్నం, రామాయపట్నంలో సముద్రం బీచ్‌లు ఉన్నాయి. దీనితో పాటు చీమకుర్తి వద్ద సాగర్‌ కాలువ, గుండ్లకమ్మ రిజర్వాయర్, పశ్చిమ ప్రకాశంలో కుంటలు, వాగు, వంకల్లో ఈతకు వెళ్తుంటారు. సెలవులు వస్తే చిన్నారులు, విద్యార్థులు, యువత సరదాగా ఈతకు వెళ్లి కుటుంబాలకు దూరమవుతున్నారు. వచ్చి రాని ఈతతో తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు.

ఈతకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుంటే వారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని చిన్నారులు.. తమ తల్లిదండ్రుల కళ్లు కప్పి ఈతకు వెళ్తుంటారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు చెరువు, బావులు, కుంటలు లోతు, పాతులపై అవగాహన ఉండదు. దీంతో సరదాగా నీటిలో దిగి బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక చనిపోతుంటారు. గుండ్లకమ్మ, చెరువులు, గుంతల్లో ఇసుక, మట్టి కోసం గుంతలు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరింది. లోతు తెలియని వారు ఈతకు గుంతల్లో దిగి కూరుకుపోయి చనిపోతున్నారు.  బావుల్లో ఈత కొట్టే వారు లోపలి తీగలను గుర్తించక వాటిల్లో చిక్కుకుంటారు. అలాంటప్పుడు ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఈత రాని వారు ఓ పర్యవేక్షకుడి సాయంతో ఈత నేర్చుకుంటే మంచిది. ఒక్కరే కాకుండా పలువురితో కలిసి ఈత కొడితే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈత కొడుతూ చనిపోయిన వారిలో తమకు పరిచయం లేని ప్రాంతాల్లో ఈత కొట్టిన వారే ఎక్కువ. ఏ మాత్రం ఈత గురించి అవగాహన లేని వారే అధికంగా ఉన్నారు.

ఇటీవల ఈతకు వెళ్లి చనిపోయింది వీరే..
ఏప్రిల్‌ 18న గూడ్లూరు మండలం దప్పళంపాడులో గుంతలో పడి రోహిత్‌ మృతి చెందాడు       
మే 6న ఇంకొల్లు మండలం దుద్దుకూరు చెరువులో పడి ఇద్దరు బాలికలు చనిపోయారు  
మే 10న మర్రిపూడి మండలం దుర్గిరెడ్డిపాలెంలో నీటి కుంటలో పడి వెంకట శివమణికంఠ, బాల మణికంఠ మృతి చెందారు.  
మే 17న కరేడు బీచ్‌లో యువకుడు గల్లంతు
అదే రోజు డిజిటల్‌ అసిస్టెంట్‌ సురేంద్ర ఈతకు వెళ్లి మృతి చెందాడు    
మే 18న తాళ్లూరు మండలం లక్కవరంలో బ్రహ్మారెడ్డి ఈతకు వెళ్లి మృతి చెందాడు.  
అదే రోజు కొత్తపట్నం బీచ్‌లో విద్యార్థి గోవర్ధన్‌ మృతి చెందాడు

అప్రమత్తంగా ఉండాలి
ఈత రాక ఇబ్బంది పడుతున్న వారిని రక్షించాలంటే ముందు రక్షించే వ్యక్తికి ఈత వచ్చి ఉండాలి. దీంతో పాటు నీటిలో మునుగుతున్న వ్యక్తిని రక్షిస్తామన్న నమ్మకం ఉండాలి. రక్షించే క్రమంలో మునిగిపోయే వ్యక్తి వెంట్రుకలను పట్టుకుని లాగటం ఉత్తమం. ఒక వేళ అతను దుస్తులు వేసుకుని ఉంటే వాటిని పట్టుకుని లాగి పైకి తీసుకుని రావాలి. అలా బయటకు తీసుకొచ్చిన వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. ఫలితంగా ఊపిరితిత్తుల మధ్య ఉన్న నీరు బయటకు వచ్చి శ్వాస తీసుకునే వీలు కలుగుతుంది. ఆ తర్వాత వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లాలి.– డాక్టర్‌ సురేష్, ప్రభుత్వ వైద్యుడు  

మరిన్ని వార్తలు