వాహనదారులు అప్రమత్తం

12 Sep, 2019 11:54 IST|Sakshi
ఆర్టీఓ కార్యాలయంలో కౌంటర్ల వద్ద నిరీక్షిస్తున్న వాహనదారులు

డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం క్యూ

కుప్పులుతెప్పలుగా స్లాట్ల బుకింగ్‌

ధ్రువపత్రాల పునరుద్ధరణపై నగరవాసుల దృష్టి

ప్రజలతో కిటకిటలాడుతున్న రవాణా శాఖ కార్యాలయాలు

సాక్షి, అమరావతి బ్యూరో : ‘నేను ఐదేళ్లుగా విజయవాడ నగరంలో ఉంటున్నాను. నగరానికి వచ్చిన కొత్తలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాను. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా బండికి ఇన్సూ్యరెన్స్‌ చేయించకుండానే సంచరించాను. ఈ–చలానాల విషయంలో పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సవరించిన చట్టం అమలు చేస్తారని తెలియడంతో అప్రమత్తం కావాల్సి వచ్చింది. రెండు రోజుల కిందటే వాహనానికి ఇన్సూ్యరెన్సు చేయించాను. గతంలో వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు ఆపితే ఎవరో ఒకరితో ఫోన్‌ చేయించడమో.. ఏదో ఒకటి చెప్పి వెళ్లడమో జరిగేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు జేబు గుల్ల అయ్యే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త పడ్డాను.’–ఓ వాహనదారుడు
..మోటారు వాహనాల చట్టం–1988కు సవరణల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ.

ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలు భారీగా వి«ధించడంతోపాటు జైలు శిక్ష ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా, ఇన్సూ్యరెన్స్‌ పత్రాలు లేకుండా, వాహన రిజిస్ట్రేషన్‌ చేయించకుండా జల్సాగా తిరుగుతున్న వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. బీమా కంపెనీలకు పరుగులు పెడుతున్నారు. మొన్నటి వరకు రోజుకు 40–50 వరకు ఉండే ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్ల బుకింగ్‌లు ఒక్కసారిగా 30 శాతం పెరిగాయంటే ప్రజలు ఎంత జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతోంది.

గరిష్టంగా రూ.25 వేలు జరిమానా..
గతంలో అయితే విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో చాలా జరిమానాలు రూ.100 వరకే ఉండేవి. సేవారుసుం రూ.35 కలుపుకొని రూ.135 కడితే సరిపోయేది. మోటారు వాహన చట్టంలో తాజా సవరణల కారణంగా ఎక్కువ ఉల్లంఘనలకు రూ.5వేల వరకు విధించే అవకాశం కనిపిస్తోంది. గరిష్ఠంగా రూ.25 వేల వరకు బాదే ప్రమాదముండటం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అంశంగా మారింది. దీనికితోడు కొన్ని ఉల్లంఘనల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేసే అవకాశముండటమూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మైనర్లకు వాహనాలిచ్చిన యజమానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడనుండటం వాహనదారుల్ని వణికిస్తోంది. నూతన చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ఉల్లంఘనులపై చర్యలతోపాటు జరిమానాలు పిడుగుపాటు మాదిరిగా తాకే అవకాశముండటంతో ముందు జాగ్రత్త పడుతున్నారు.

ఇన్సూ్యరెన్స్‌ కియోస్క్‌ల వద్ద సందడి
వాహన పత్రాలంటే సాధారణంగానే రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గుర్తుకొస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే చాలావరకు షోరూం నిర్వాహకులే రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూ్యరెన్స్‌ చేయించడం సర్వసాధారణం. ఇన్సూ్యరెన్సు కాలపరిమితి తీరిన తర్వాత పునరుద్ధరించుకోవడంలోనే చాలామంది వాహనదారులు బద్ధకిస్తుంటారు. ఇన్సూ్యరెన్‌స పునరుద్ధరించని సమయంలో వాహనదారుడు ప్రమాదానికి గురైతే జరిగే ఆర్థిక, ప్రాణనష్టం ఖాయం. వాహన ఇన్సూ్యరెన్స్‌ విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు కీలక దృష్టి సారిస్తుండటంతో చాలామంది వాహనదారులు వాహన బీమా పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు. పెట్రోల్‌బంక్‌ల్లోని కియోస్క్‌ల వద్ద సందడి పెరగడమే ఇందుకు తార్కాణం.

జరిమానాలు ఇలా...
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే మోటారు వాహనాల చట్టంలోని 181 సెక్షన్‌ ప్రకారం గతంలో రూ.500 జరిమానా ఉండేది. తాజా సవరణల క్రమంలో అది రూ.5 వేలు విధించే అవకాశముంది.
ఇన్సూ్యరెన్స్‌ చేయించని వాహనాన్ని నడుపుతూ దొరికితే 196 సెక్షన్‌ ప్రకారం గతంలో రూ.1,000 జరిమానా విధించేవారు. సమీప భవిష్యత్తులో రూ.2వేల వరకు విధించొచ్చు.
చట్టంలోని 206 సెక్షన్‌ ప్రకారం పోలీసు అధికారులు అవసరమైతే వాహన పత్రాల్ని స్వాధీనపరుచుకునే అధికారముంది. గతంలో ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇకపై పత్రాల విషయంలో అనుమానముంటే ఈ నిబంధనపై గట్టిగా దృష్టి సారించే అవకాశముంది.
ఉల్లంఘనను బట్టి అవసరమైతే 183, 184, 185, 189, 190, 194సి, 194డి, 194ఇ సెక్షన్ల ప్రకారం పోలీసులు పత్రాల్ని జప్తు చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయొచ్చు.

ధ్రువపత్రాలు తప్పనిసరి
మోటార్‌ వాహన సవరణ చట్టం ప్రకారం రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలున్నాయన్న సంగతి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. డ్రైవింగ్‌ లైసెన్సుతో సహా బీమా, కాలుష్య పరిమితి పత్రం.. ఇలా అన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రవాణాశాఖ, ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీల్లో పట్టుపడితే భారీ జరిమానాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు వీటిని తమ వద్ద ఉంచుకోవాలి. అలా కానీ పక్షంలో ఎం–పరివాహన్‌ మొబైల్‌ యాప్‌లో మన వివరాలు నమోదు చేసుకుంటే అవి మనతోనే ఉంటాయి. ఎం–పరివాహన్‌ మొబైల్‌ యాప్‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపొందించింది.
– ఎస్‌.వెంకటేశ్వరరావు, డీటీసీ,

>
మరిన్ని వార్తలు