అతిక్రమణకు తప్పదు మూల్యం

2 Mar, 2019 13:08 IST|Sakshi

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి

హెల్మెట్‌ ధారణ అవసరం

వాహనాల ఫిట్‌నెస్‌ ముఖ్యం

పాటించకుంటే జరిమానా..జైలు

విజయవాడ, గుడ్లవల్లేరు(గుడివాడ): రకరకాల పనులపై ఇంటినుంచి తమతమ వాహనాల్లో ప్రజలు బయటకు వెళుతుంటారు. అలా వెళ్లిన వారిలో చాలామంది ప్రమాదాలు జరిగి మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. బాధిత కుటుంబాల్లో చీకట్లు నెలకొంటున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలను ఫిట్‌గా ఉంచుకుంటే ప్రయాణాలు సుఖవంతంగా జరుగుతాయి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు రవాణా శాఖాధికారుల నుంచి వస్తున్నట్లే రవాణాలో తమకు రక్షణ ఉండటం లేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైకిస్టులు, వాహన చోదకులు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్కూల్‌ పిల్లలను ఎక్కించే బస్సులు కండీషన్‌లో లేవనే ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణాల్లో కొన్ని నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అదుపు చేసుకోవచ్చు.

స్కూల్‌ బస్సుకు నిబంధనలు పాటించాలి
ఏపీ మోటారు వాహనాల నియమావళి ప్రకారం 1989లో 185 (జి)ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోరాదు. 60 ఏళ్ల వయసు దాటినవారు డ్రైవింగ్‌ చేయకూడదు. పర్మిట్‌ నిబంధనలను ఉల్లంఘించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహన చట్టం సెక్షన్‌ 86 ప్రకారం జరిమానా, పర్మిట్‌పై చర్య కూడా ఉంటుంది.

డ్రైవింగ్‌లో సెల్‌ మాట్లాడితే ప్రమాదమే
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే మోటారు వాహన చట్టం 184 ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. లేదా సీఎంవీ రూల్‌ 21 ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు చేస్తారు. సెల్‌లో మాట్లాడుతూ ఏ వాహనాన్ని డ్రైవ్‌ చేసినా ఇవే చర్యలుంటాయి.

హెల్మెట్‌తో ప్రాణానికి రక్ష
వాహన చోదకుడు హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రమాదాల సమయంలో ప్రాణానికి హాని తక్కువగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 129 ప్రకారం హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే సెక్షన్‌ 177 ప్రకారం జరిమానా రూ.వంద విధిస్తారు.   

అతి వేగం ప్రమాదం
అతివేగం అత్యంత ప్రమాదకరం. అతివేగం వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడతారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 112, 183(1)ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

మద్యం సేవించి నడిపితే మృత్యు కౌగిలే..
మద్యం సేవించి వాహనం నడిపితే మృత్యువాత పడాల్సిందే. మద్యం సేవించిన సమయంలో చిన్న మెదడు పని చేయకపోవడం వల్ల ఎదుట వచ్చే వాహనాలను గుర్తించే శక్తి తగ్గుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడిపితే వాహన చట్టం సెక్షన్‌ 185 ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష విధిస్తారు.

సిగ్నల్‌ అధిగమిస్తే చర్యలు
ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ సిగ్నల్‌ జంపింగ్‌ చేస్తే నేరం. ఈ దుందుడుకు చర్య వల్ల సిగ్నల్‌ ఇచ్చిన వైపు నుంచి వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతారు. ఇలా చేస్తే వాహన చట్టం సెక్షన్‌ 184 ప్రకారం ఆరు నెలల వరకు జైలుశిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా విధిస్తారు.

వాహనం నడపాలంటే ఇవి తప్పనిసరి
వాహనం నడుపుటకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పొల్యూషన్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్‌ లేకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్లు 39, 192 ప్రకారం జరిమానా ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుంటే మోటారు సెక్షన్‌ 3, 4, 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలుశిక్ష తప్పదు. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేని వాహన చోదకునికి సెక్షన్‌ 190 (2) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్‌ లేకపోతే సెక్షన్‌ 196 (ఎ) ప్రకారం మూడు నెలల జైలశిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా ఉంటుంది.

సీట్‌బెల్ట్‌తో ప్రయాణం సురక్షితం
కారులో సీట్‌బెల్ట్‌ పెట్టుకుని ప్రయాణిస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరవచ్చు. డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్నవారే కాకుండా ఫ్రంట్‌ సీట్‌లో కూర్చున్నవారు కూడా బెల్ట్‌ పెట్టుకుంటే మంచిది. సీఎంవీ రూల్‌ 138 (3) ప్రకారం విధిగా సీట్‌బెల్ట్‌ ధరించాల్సిందే. సీట్‌బెల్ట్‌ ధరించనిచో మోటారు వాహన చట్టం సెక్షన్‌ 177ప్రకారం రూ.వెయ్యి జరిమానా తప్పదు.

మరిన్ని వార్తలు