ష్‌... గిరినాగు! 

29 May, 2020 08:00 IST|Sakshi

తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమవుతున్న సర్పరాజాలు 

పొలాల్లో ప్రాణభయంతో చంపేస్తున్న రైతులు 

సంరక్షించేందుకు అటవీ శాఖ, వన్యప్రాణి సంస్థల ప్రయత్నం 

రెండు నెలల్లో నాలుగు పాములకు రక్షణ 

గిరినాగు... దట్టమైన అరణ్యాలకే పరిమితమైన పాము. అత్యంత విషపూరితమే అయినా ప్రకృతిలో ఇతరత్రా విషపూరిత, విషరహిత పాములను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. తద్వారా అవి అసంఖ్యాకంగా పెరిగిపోకుండా ప్రజలకు పరోక్షంగా మేలు చేస్తోంది. చాలా అరుదుగానే కనిపించే ఈ పాము ఇటీవల పొలాలు, జనవాసాల మధ్యకు వచ్చేస్తోంది. గత రెండు నెలల కాలంలోనే జిల్లాలోని తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ఐదు ప్రత్యక్షమయ్యాయి. ఒక దాన్ని ప్రాణభయంతో రైతులు చంపేశారు. వాటి సంరక్షణపై అవగాహనతో కొంతమంది ఇచ్చిన సమాచారంతో నాలుగు సర్పాలను అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రతినిధులు కాపాడారు.

సాక్షి, విశాఖపట్నం: మన జిల్లాలోని ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించిన తూర్పు కనుమల్లో అటవీ ప్రాంతం గిరినాగులకు ఆవాసంగా ఉంది. జిల్లాలో ముఖ్యంగా దేవరాపల్లి, చీడికాడ మండలాలతో పాటు అనంతగిరి, హుకుంపేట మండలాల్లో కొంతమేర విస్తరించి ఉన్న సుమారు 10వేల హెక్టార్ల తెనుగుపూడి అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వీటి పొడవు పది నుంచి పద్నాలుగు అడుగులు. (వైరల్‌ వీడియో.. కింగ్‌ కోబ్రాకు తలస్నానం)  

అత్యంత ప్రమాదకర కాలం... 
మార్చి నుంచి జూన్‌ నెల వరకూ ఆడ, మగ గిరినాగులు సంగమించే కాలం. మగ పాములను ఆకర్షించేందుకు ఆడ గిరినాగు ఫెరామోన్స్‌ అనే ఒకవిధమైన రసాయన పదార్థాన్ని తన శరీరం నుంచి వెదజల్లుతుంది. ఆ వాసనను బట్టి మగ గిరినాగులు ఎక్కడున్నా వాటిని అనుసరిస్తుంటాయి. అలాగే ఈ వేసవిలో అటవీ ప్రాంతంలో జలవనరులు తగ్గిపోయినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ పొలాల్లోకి వచ్చేస్తుంటాయి. ఇక రబీ సీజన్‌ తర్వాత పొలాల్లో నాగుపాములు, రక్తపొడ, కట్లపాము వంటి విషపూరిత పాములతో పాటు జెర్రిగొడ్డు వంటి విషరహిత పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వాటిని తినేందుకు వచ్చేస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గిరినాగులకు ఈ నాలుగు నెలల కాలమూ ప్రాణసంకటమే. ఇవి కనిపించినపుడు ప్రాణభయంతో రైతులు చంపేస్తున్నారు. (ఇంటి పై క‌ప్పు మీద నాగుపాము)

ఇటీవలే చీడికాడ మండలంలో భారీ గిరినాగును కొట్టి చంపేశారు. వీటిపై అవగాహన ఉన్నవారు ఏమాత్రం సమాచారం ఇచ్చినా అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంస్థ ప్రతినిధులు స్పందిస్తున్నారు. సకాలంలో చేరుకొని గిరినాగులను పట్టుకుంటున్నారు. తర్వాత వాటిని అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇలా గత ఏడాది కాలంలో జిల్లాలో పది గిరినాగులను సంరక్షించారు. వాటిలో నాలుగు గత రెండు నెలల్లో దొరికినవే ఉన్నాయి. ఒకదాన్ని మాత్రం దేవరాపల్లి మండలంలో ఇటీవల కొంతమంది రైతులు ప్రాణభయంతో చంపేశారు.

గిరినాగు కనిపిస్తే అటవీ శాఖ స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. గిరినాగుల సంరక్షణ కోసం పనిచేస్తున్న తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రతినిధులకు 86391 24883 నంబరులో సంప్రదించాలి. వారు వచ్చి ఆ పామును పట్టుకుంటారు. దాన్ని సురక్షితంగా రక్షిత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి జనావాసాలకు దూరంగా వదిలిపెడతారు.      

పదేళ్ల నుంచి సర్వే చేస్తున్నాం... 
గిరినాగు అరుదైన సర్పజాతి. కాటేస్తే పది నిమిషాల్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. వీటిని కాపాడటానికి అటవీశాఖ సహకారంతో పదేళ్లుగా సర్వే చేస్తున్నాం. నాలుగేళ్ల క్రితం విశాఖ డివిజన్‌లో ప్రారంభించాం. గిరినాగు సహా వన్యప్రాణులను చంపవద్దని, మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుంటామని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. పాము కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తున్నారు.
– మూర్తి కంతిమహంతి, తూర్పు కనుమల వన్యప్రాణుల సంస్థ ప్రతినిధి

కనిపిస్తే సమాచారం ఇవ్వండి... 
తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో నాలుగు గిరినాగు పాములను పట్టుకున్నాం. వీటిని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశాం. పాములు కనిపించినపుడు ప్రాణభయంతో చంపేయవద్దు. అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాం.  
– ఎం.రమేష్‌కుమార్, అటవీశాఖ అధికారి, తెనుగుపూడి ఫారెస్ట్‌ ఏరియా

మరిన్ని వార్తలు