అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు

12 May, 2015 17:19 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన పాత్రుడి పేషీలో అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు అధికారులను తొలగించారు. 45 కోట్ల రూపాయల పనుల కేటాయింపునకు సంబంధించి మంత్రి ఓఎస్డీ, పీఎస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో వారిద్దరినీ విధుల నుంచి తప్పించారు.

విశాఖపట్నం జిల్లా చింతపల్లి, పాడేరు రహాదారులకు సంబంధించి 45 కోట్ల రూపాయల విలువైన పనులను తమ వారికి ఇప్పించుకునేందుకు మంత్రి ఓఎస్డీ, పీఎస్ ప్రయత్నించారు. భారీ మొత్తంలో నిధులున్న పనులను నామినేషన్ల పద్ధతి ద్వారా కేటాయించాలని మంత్రికి ఫైలు పంపారు. ఈ విషయంపై మంత్రి ఆరా తీయగా, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడినట్టు అయ్యన్న పాత్రుడి దృష్టికి రావడంతో వారిని తొలగించారు. గతంలో కూడా వీరిద్దరూ ఓ ఆర్డీఓ బదిలీ విషయంలో జోక్యం చేసుకున్నట్టు మంత్రి దృష్టికి వచ్చింది. ఆర్డీఓ నుంచి తీసుకున్న 30 లక్షల రూపాయల లంచాన్ని మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వెనక్కి ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు