అయ్యప్ప మాలవేశారని.. వారి కడుపుకొట్టారు!

17 Jan, 2020 07:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అయ్యప్ప మాలవేశారని నలుగురు ఉద్యోగుల తొలగింపు

ఆర్‌కా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఎదుట బాధితుల ఆందోళన 

తనకల్లు: అయ్యప్ప మాల వేశారని నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించడంపై బాధితులు గురువారం అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని ఈతోడు రోడ్డులో ఉన్న ఆర్‌కా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఎదుట ఆందోళన చేశారు. బాధిత ఉద్యోగులు చరణ్‌రెడ్డి, బాలాజీ, సురేష్‌నాయక్, సిద్ధారెడ్డి మాట్లాడుతూ..మూడేళ్లుగా ప్లాంట్‌లో పని చేస్తున్నామని, ఈనెల 12న కంపెనీ యాజమాన్యం తమను ఉన్నఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించిందని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే కంపెనీ ప్రతినిధులు మీరు అయ్యప్ప స్వామి మాల వేయడమే కాకుండా ప్లాంట్‌ ప్రాంగణంలో పూజలు కూడా చేశారని సమాధానమిచ్చారన్నారు. 

ఇలాంటి కారణాలతో తమ కడుపుకొట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు వాపోయారు. తాము విధుల పట్ల ఏనాడు నిర్లక్ష్యం చూపలేదని, 106 ఎకరాల్లోని సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లో విపరీతంగా పెరిగిపోయిన గడ్డిని సైతం తామే రోజూ తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని  కోరుతూ ప్లాంట్‌ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఏఎస్‌ఐ బాలరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్లాంట్‌ అధికారులతో చర్చించారు. ప్లాంట్‌ ముఖ్య అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో బాధితులు శాంతించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా