సీఎం జగన్‌తో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రతినిధుల భేటీ

26 Jul, 2019 14:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సీఈఓ ఆనంద్‌ విశ్వనాథన్‌, ఇతర ప్రతినిధులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రకృతి వ్యవసాయం గురించి సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి తాము సహాయం అందిస్తామని అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఐదేళ్లలో రూ. 100 కోట్లమేర సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని, అవసరమైన సాకేంతిక సహకారం అందిస్తామని చెప్పారు. 

పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి విధివిధానాలు, పద్దతులు మరింత సమర్థవంతంగా రూపొందించాల్సి అవసరం ఉందంటూ సీఎం వైఎస్‌ జగన్‌ తన అభిప్రాయాలను వారికి తెలిపారు. సేంద్రియ ఎరువులను రాయితీపై అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీఎం వారికి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పలు చర్యలు తీసుకున్నామని వారికి వివరించారు. భవిష్యత్తులో పూర్తి నాణ్యత కలిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ప్రభుత్వ లేబరేటరీల్లో పరీక్షించిన తర్వాతే గ్రామాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ట్యాబ్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడానికి, మార్కెట్‌ స్థిరీకరణకు పలు ప్రణాళికలతో మందుకు వెళ్తున్నామని వారికి తెలియజేశారు.

మరిన్ని వార్తలు