బాబోయ్ కంపు..!

16 Jul, 2015 00:23 IST|Sakshi
బాబోయ్ కంపు..!

♦ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతం
♦ చెత్తకుప్పలుగా మారిన పట్టణాలు
♦ జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
♦ గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు...
♦ మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిక
 
 అరండల్‌పేట(గుంటూరు) : పురపాలక సంఘాలు, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారి శుధ్య కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుండడంతో వీధులన్నీ చెత్తతో పేరుకుపోయాయి.ప్రధానంగా జిల్లాలోని 12పట్టణాలు, గుంటూరు నగరం మురికి కూపాలుగా మారిపోయాయి. రోడ్లపై చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీనికితోడు వర్షం కురవడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వీధి చూసినా చెత్త, చెదారంతో నిండిపోయి కంపుకొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ, వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 కార్మికుల నిరవధిక నిరాహార దీక్షలు
 కార్మికులకు కనీసవేతనం రూ.15వేలు ఇవ్వాలని, అలాగే పదవ వేతన సవరణను పర్మనెంట్ కార్మికులకు అమలు చేయాలని, జీఓ నంబరు 261 అమలుతో పాటు మొత్తం 17 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. అయితే రాష్ట్రప్రభుత్వం రెండు విడతలుగా వీరితో చర్చలు జరిపినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. తొలివిడత చర్చల్లో కార్మికులకు కనీస వేతనం రూ.13వేలు ఇస్తామని ఒప్పుకున్న ప్రభుత్వం తర్వాత మాటమార్చి తొమ్మిది, పదివేలంటూ బేరాలాడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు రెండు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలకు  దిగారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పురపాలక సంఘాల ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

 గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు...
  జిల్లాలోని అన్ని పట్టణాల్లో పర్మనెంట్ కార్మికులతో పారిశుధ్య పనులు చేయించాలని ఉన్నతాధికారులు కమిషనర్లను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, కమిషనర్లు పర్మనెంట్ కార్మికులు విధుల్లోకి రావాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. దీన్ని ఖాతరు చేయక పోవడంతో వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. అదేసమయంలో గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్ సి.అనురాధలు మార్కెట్ల వద్ద చెత్తను త రలించేందుకు బుధవారం ప్రయత్నించగా కార్మికులు, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. అదేవిధంగా చెత్తను తరలించే వాహనాల్లో గాలి తీశారు. దీంతో అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాలోని అన్ని పట్టణాల్లో మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని యూనియన్‌నాయకులు ప్రకటించారు.
 
 ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం : వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
  రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన ప్రభుత్వం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని  కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.  ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు