బాబు వచ్చారు.. వీరి జాబు పోయింది

20 Jun, 2015 02:04 IST|Sakshi

♦ డీఆర్‌డీఏలోని ఎన్‌పీఎం సీఎంఎస్‌ఏలకు తీవ్ర అన్యాయం
♦ కేవలం ఒక సెల్‌ఫోన్ మెసెజ్‌తో తొలగింపు
♦ రోడ్డున పడిన 812 మంది సిబ్బంది
♦ బకాయిలు కూడా చెల్లించని మొండిప్రభుత్వం
♦ న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న బాధితులు
 
 కడప రూరల్ : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఊదరగొట్టింది. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. జాబు వచ్చే సంగతి దేవుడెరుగు.. ఉన్న జాబులను ఊడగొట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని ఎన్‌పీఎం సీఎంఎస్‌ఏ (పురుగు మందులు లేని వ్యవసాయం) విభాగంలో జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో 575 మంది వీఏలు, 115 మంది సీఏలు, కమిటీకి చెందిన115 మంది, ఏడుగురు ఆపరేటర్లు మొత్తం 812 మందికి తీవ్ర అన్యాయం జరిగింది. వీరంతా 2006 నుంచి పని చేస్తున్నారు.

గడిచిన ఏప్రిల్ 22న సెర్ఫ్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ‘మీ సేవలు ఇక చాలు’ అని మెసెజ్ వచ్చింది. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. వీరు శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జి.రామయ్య, పి.ఓబులయ్య, సురేష్‌బాబు, డి.ఓబులేశు, ఇ.కృష్ణమూర్తి, ఎన్‌పీఎంసీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఆవేదన వెళ్లగక్కారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

వీరంతా క్షేత్ర స్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలంబడుల ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వడం, అంతర పంట సాగుపై మెళుకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపి చైతన్యవంతులను చేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో.. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

 ఒక్కొక్కరికి వేలల్లో బకాయిలు
 వీరికి గడిచిన ఏడాది నుంచి ఎలాంటి బకాయిలు అందలేదు. అంటే వీరిని తొలగించక ముందు నుంచి ప్రభుత్వం బకాయిలను మంజూరు చేయలేదు. వారంతా నిరుపేదలు. చాలీచాలని జీతాలతో ఎలాగోలా ఈ ఉద్యోగాలనే నమ్ముకుని నెట్టుకొస్తున్నారు. అలాంటిది ఉన్న ఫళంగా తొలగించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక్కొక్కరికి మొత్తం బకాయిలు రూ. 50 వేలకు పైగా రావాల్సి ఉంది. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన కనిపించలేదు.

తమకు ప్రత్యామ్నాయం చూపకపోవడంతోపాటు ఉన్న ఫళంగా తొలగించడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ సిబ్బందిని అక్కడ కొనసాగిస్తుంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేటు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే కుటుంబాలు మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు