'జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు విప్పాలి'

13 Feb, 2015 19:57 IST|Sakshi

అనంతపురం (కదిరి): తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమా, లేక పార్టీ తరఫునా.. అనేదానిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాలని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అద్యక్షుడు సోమగుట్ట విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మిత్ర ధర్మాన్ని పాటించి టీడీపీ నాయకుల మాటలను ఓర్చుకుంటున్నాం. జేసీని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఉంది. ఆయన మాటలను ఆ పార్టీ ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం మీద, దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద చేసిన విమరలను ఆయన తక్షణం ఉపసంహరించుకోకపోతే తగిన స్థాయిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డిని తక్షణం ఏదైనా మెంటల్ ఆసుపత్రిలో చేర్చకపోతే మనుషులను కరిచే ప్రమాదం ఉందని విష్ణువర్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరుతామంటూ ఆనం బ్రదర్స్ తమ కార్యాలయం చుట్టూ తిరిగిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. ‘ఆనం వివేకా తన పేరును అవివేక అని మార్చుకుంటే మంచిది. ఆయన బఫూన్‌లా.. పగటి వేషగానిలా మారిపోయాడు. పీసీసీ అద్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌లు కూడా బీజేపీని విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
సొమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబుది
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలుగా చెప్పుకోవడం బాధాకరమని బీజేపీ ఫైనాన్స్ కమిటీ చెర్మైన్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుబ్బరాజుగుప్త ఆవేదన వ్యక్తం చేశారు. రూ.600 విలువ చేసే ఎల్‌ఈడీ బల్బులను కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తుంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా వాటిపై చంద్రబాబు బొమ్మను ముద్రించుకోవడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు