సుజలం.. విఫలం

18 May, 2019 10:55 IST|Sakshi
కపిలేశ్వరపురం మండలం అంగరలో తొలి ఎన్టీఆర్‌ సుజల వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, పి.గన్నవరం మండలం పోతవరం వద్ద బోరుకే పరిమితమైన మదర్‌ ప్లాంటు పనులు

మండపేట: అధికారంలోకి వచ్చిన వెంటనే.. ‘ఎన్‌టీఆర్‌ సుజల’ పథకం కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందజేస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోయింది. 2014 అక్టోబరు 4న కపిలేశ్వరపురం మండలం అంగరలో ఏర్పాటు చేసిన తొలి విడత జన్మభూమిలో భాగంగా మొట్టమొదటి ఎన్‌టీఆర్‌ సుజల ప్లాంటును చంద్రబాబు ప్రారంభించారు. జిల్లాలో 1072 పంచాయతీలకు గాను తొలిదశలో దాతల సాయంతో 234 ఎన్‌టీఆర్‌ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేయగా, రాష్ట్ర అభివృద్ధి నిధులు (ఎస్‌డీఎఫ్‌) నుంచి 19 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లో ఎస్‌డీఎఫ్‌ నిధులతో ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించినా నిధుల లేమితో కార్యరూపం దాల్చలేదు.

తాగునీటి సమస్య అధికంగా ఉన్న సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. నిర్వహణ భారంతో ఇప్పటికే దాదాపు 25 శాతం ప్లాంట్లు మూతపడ్డాయి. రాజోలు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు మూతపడగా, అమలాపురంలో నాలుగు, ముమ్మిడివరంలో రెండు, పి.గన్నవరంలో రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోను పలు ప్లాంట్లు మూతపడినట్టు అధికారులు చెబుతున్నారు. అంగరలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుజల ప్లాంటు మూతపడి ఆరు నెలలు కావస్తోంది. 20 లీటర్లకు రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉండగా నిర్వహణ భారంతో కొన్నిచోట్ల రూ.ఐదు నుంచి రూ.10 వరకు తీసుకుంటున్నారు. 


అడుగుపడని క్లస్టర్లు 
రెండో విడతగా జిల్లాలోని కోనసీమలో 204 గ్రామాలకు మినరల్‌ వాటర్‌ను అందించేందుకు అంబాజీపేట, కాట్రేనికోన, పి. గన్నవరం క్లస్టర్లుగా అధికార యంత్రాంగం విభజించింది. రూ.11.53 కోట్ల వ్యయంతో ఆయా చోట్ల మదర్‌ ప్లాంట్లు  ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాల్లో డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్ల ద్వారా రూ.రెండుకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందజేయాలన్నది లక్ష్యం. మదర్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం మూడు క్లస్టర్ల పరిధిలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు జనవరిలో బోర్లు తీయించారు. నిధుల కొరతతో బోర్ల దశలోనే పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రూ.2కు మినరల్‌ వాటర్‌ అందలేదు.

పథకం అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యం తమకు మినరల్‌ వాటర్‌ అందకుండా చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. కేవలం 23 శాతం పంచాయతీల్లో మాత్రమే ఎన్‌టీఆర్‌ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శిస్తున్నారు. ప్రైవేటు ప్లాంట్ల వద్ద 20 లీటర్ల నీటికి రూ.10 నుంచి రూ.30 వరకు వెచ్చించ వలసి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు