ఉచిత విద్యుత్‌... ఉత్తిదే...

15 Mar, 2019 12:29 IST|Sakshi

రజకులు, నాయీ బ్రాహ్మణులకు అమలుకాని ఉచిత విద్యుత్‌

చంద్రబాబు తీరుపై మండిపడుతున్న పజలు

రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటున్న జనం

సాక్షి, గిద్దలూరు: హామీలు ఇవ్వడంలో చంద్రబాబుబును మించిన వారు లేరని ప్రజల్లో ప్రచారం ఉంది. నోటికి అంది వచ్చిన హామీలన్నీ గుప్పించి చివరకు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటోకో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలా హామీల మీద హామీలు గుప్పించి ప్రజలను ఆశకు గరిచేసి తీరా గద్దెనెక్కాక చేయిచ్చిన చంద్రబాబు తాజాగా మరో హామీని తుంగలో తొక్కారు. నాయీ బ్రాహ్మణులు, రజకుల దుకాణాలకు సంబంధించి 150 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీ అమలు కాలేదు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఇక అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. నెలనెలా విద్యుత్‌ బిల్లులు వస్తుండటంతో రజకులు, నాయీ బ్రాహ్మణులు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అమలు కాని హామీలు ఎందుకివ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఐదేళ్లయినా వెనుకబడిన కులాల కోసం ఏమీ చేయలేదని బీసీలు టీడీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉచిత విద్యుత్‌ అందిస్తారంటే ఆశపడ్డారు. పొదుపు మహిళల నుంచి, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకే దొంగ హామీలు..


బార్బర్‌ సెలూన్‌

ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం చేపట్టేందుకే చంద్రబాబు ఇలాంటి దొంగ హామీలు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఐదేళ్లయినా మాఫీ చేయలేదు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి పసుపు కుంకుమ పేరుతో చెక్కులిచ్చారు. ఇదే కాకుండా ప్రతి పొదుపు మహిళకు సెల్‌ఫోన్‌ స్తిమని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హామీలు నీటిమీద బుడగలు తప్ప అమలు చేయరని మరోసారి తేలిపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 550మంది నాయీబ్రాహ్మణులు, 150మంది రజకులు ఉచిత విద్యుత్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రతి నెలా బిల్లు కడుతున్నా..
మంగళి షాపుకు విద్యుత్‌ బిల్లులో 150 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నెలకు రూ.400 బిల్లు చెల్లించే అవసరం లేదని ఆనందం వేసింది. హామీ ఇచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలు కాలేదు. బిల్లు రావడం ఆగుతుందని ఆశపడుతున్నా కానీ, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిందేనని కరెంటోళ్లు వెంటబడి కట్టించుకెళుతున్నారు. లేదంటే కరెంట్‌ సరఫరా నిలిపేస్తామంటున్నారు.
– పి.శివప్రసాద్, నాయీ బ్రాహ్మణుడు, గిద్దలూరు

జాబితా ఇచ్చాం.. ఉత్తర్వులు అందలేదు
ఉచిత విద్యుత్‌ కోసం జాబితా సిద్ధం చేసి పంపించాం. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు అందలేదు. బిల్లులు యాథావిధిగా ప్రతినెలా వసూలు చేస్తున్నాం.
–చంద్రశేఖరరెడ్డి, ఏఈ, విద్యుత్‌ శాఖ, గిద్దలూరు 

మరిన్ని వార్తలు