కేజీహెచ్‌లో కిడ్నాప్‌ కలకలం 

27 Dec, 2019 08:56 IST|Sakshi
ప్రియాంక బిడ్డకు కేజీహెచ్‌లో కేటాయించిన పడక

తల్లే బిడ్డను తీసుకెళ్లిపోయిందంటున్న సిబ్బంది 

పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ బిడ్డ కిడ్నాప్‌ అయ్యిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేజీహెచ్‌లో కలకలం రేగింది. అయితే కుటుంబ సమస్యల వల్ల తల్లే బిడ్డను తీసుకుని వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సమీప కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన ప్రియాంక తన నాలుగు నెలల బిడ్డను కేజీహెచ్‌ పిల్లల వార్డులో ఈ నెల 23న వైద్య సేవల నిమిత్తం చేర్చింది. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఆధార్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను పిల్లల వార్డులోని ఆరోగ్యశ్రీ సిబ్బంది నుంచి తీసుకుని వెళ్లిపోయింది.

కొంతసేపటి తర్వాత ఆమె భర్తకు సంబంధించిన వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డ కిడ్నాప్‌ అయ్యిందని ఆందోళనకు దిగారు. అయితే బిడ్డకు కేటాయించిన పడక మీద మొత్తం సామగ్రితోపాటు పాల డబ్బా కూడా వదిలి వెళ్లిపోవడంతో వార్డులో కలకలం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో బిడ్డను తీసుకుని ప్రియాంక వెళ్లిపోయి ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై కేజీహెచ్‌లోని పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఫోన్‌ నెంబరు పనిచేయకపోవడంతో ఎటువంటి సమాచారమూ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భర్త, అతని కుటుంబ సభ్యులపై నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ప్రియాంక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  

>
మరిన్ని వార్తలు