నేను వినలేను సార్‌..!

19 Dec, 2019 12:12 IST|Sakshi
యశ్వంత్‌తో అతని తల్లి , వైద్యశాలకు తీసుకువెళ్తున్న తండ్రి సిద్దయ్య

వినికిడి జ్ఞానం కోల్పోయిన బాలుడు

ఆపరేషన్‌ చేస్తే మాట వినబడే అవకాశం

రూ. 7లక్షల అవసరం

ప్రకాశం, ఉలవపాడు: పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వినికిడి లోపంతో పుట్టిన ఆ బిడ్డను చూసి నిశ్చేష్టులయ్యారు. దీనిని గుర్తించడానికి కాస్త సమయం పట్టింది. అయితే వయసు పెరిగే కొద్దీ వినికిడి జ్ఞానం వస్తుందేమో అని కొందరు వైద్యులు అనడంతో ఎదురుచూశారు. నెమ్మదిగా బాబుకు 8 ఏళ్లు దాటినా వినపడకపోవడంతో పెద్ద వైద్యశాలలో చూపించారు. రెండు చెవులు పనిచేయడంలేద.. ఆపరేషన్‌ చేసి లోపల యంత్రాలు అమరిస్తే వినబడుతుందని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియచేశారు. దీనికి సుమారు రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి అంత డబ్బు ఎలా తేవాలో తెలియక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటున్న ఆండ్ర సిద్దయ్య సొంత గ్రామం వలేటివారిపాలెం మండలం నలదలపూరు. అయితే బద్దిపూడి గ్రామానికి చెందిన అమరావతిని వివాహం చేసుకున్నాడు.

వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానంగా కలిగారు. మగబిడ్డ అయిన యశ్వంత్‌ సాయి పుట్టుక నుంచి వినికిడి లోపం కలిగింది. అయితే ఇతని తల్లి అమరావతి తమ్ముళ్లు కూడా దివ్యాంగులు కావడంతో ఆ కుటుంబం ప్రస్తుతం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటోంది. యశ్వంత్‌ సాయికి పలు చోట్ల చెవిటికి సంబంధించి పరీక్షలు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాల వైద్యులు పరీక్షలు జరిపి ఆపరేషన్‌ చేస్తే వినబడుతుందని తెలియచేశారు. కూలీ పనులు చేసుకునే సిద్దయ్యకు రూ. 7 లక్షలు ఎక్కడ నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నాడు.

సీఎం సహాయ నిధి నుంచిరూ. 2 లక్షలు ..
బాధితుని తండ్రి తన కుమారునికి నయం చేయించాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డికి దరఖాస్తు అందచేయడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే రూ. 2 లక్షలు మంజూరుచేసింది. కానీ మరో రూ. 5 లక్షలు తీసుకుని వైద్యశాలకు వెళితే కానీ ఆపరేషన్‌ చేసే వీలు కలుగుతుంది. యశ్వంత్‌ సాయికి ఆపరేషన్‌ చేస్తే వినికిడి శక్తి వస్తుందని వైద్యులు నిర్ధారించారు. చెవి ఆపరేషన్‌లో భాగంగా కాక్లియర్‌ ఇంప్లాంట్, స్పీచ్‌ డివైస్‌ను లోపల అమర్చితే బాబుకు మాట వినబడుతుంది. పరీక్షల నిమిత్తం ప్రస్తుతం ఈ చిన్నారి హైదరాబాద్‌ వైద్యశాలలోనే ఉన్నాడు. పేదరికంలో ఉన్న ఈ కుటుంబానికి ప్రస్తుతం చేయూత అవసరం.

ఆదుకోవాలనుకునేవారు
ఆండ్ర సిద్దయ్య బ్యాంకు అకౌంటు నంబరు 6652355277 (శాఖవరం గ్రామం), ఐయఫ్‌యస్‌సీ కోడు ఐడీఐబీ 0005068 నంబరుకు పంపాలని కోరారు. బద్దిపూడి గ్రామానికి చెందిన ఫిజియోధెరపీ వైద్యుడు తాటితోటి సుధాకర్‌ (ఫోన్‌ నంబర్లు 9182007257,9948345663)ను సంప్రదించి దాతలు సహకరించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు